logo

కోట్ల గూటికి పాత నేతలు

ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్‌’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి..

Published : 24 Apr 2024 05:30 IST

కర్నూలు, న్యూస్‌టుడే: ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్‌’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. ఇన్నాళ్లు ఫ్యాన్‌ కింద ఉన్న కొందరు సైకిలెక్కుతున్నారు. వీరి సంఖ్య పెరగడంతో ‘అధికారం’ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. తట్టుకోలేక బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత నెల 26న వైకాపా కార్యాలయం వద్ద అసభ్యపదజాలంతో రెచ్చగొడుతూ...పార్టీని కించపరిచే విధంగా మాట్లాడారని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయడంతో గుమ్మకొండకు చెందిన తెదేపా సర్పంచి దశరథరామిరెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పసుపు దళం బలం పెరగడంతో వైకాపా నేతలు తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

పెరుగుతున్న పసుపు బలగం

డోన్‌ నియోజకవర్గంలో తెదేపా జెండాను ఎగరవేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధిష్ఠానం ప్రత్యేక వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా రాజకీయ కుటుంబం, మంచిపేరున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని బరిలో దింపింది. ‘కోట్ల’ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటి నుంచీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సతీమణి సుజాతమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో ‘కోట్ల’ వెంట నడిచిన వారు వైకాపా నేత బుగ్గన చెంతన చేరారు. ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా ‘కోట్ల’ రావడంతో గతంలో ఆయనతో కలిసి పనిచేసిన వారంతా సొంతగూటికి చేరుతున్నారు. బేతంచెర్ల, ప్యాపిలి, డోన్‌లో తెదేపాలోకి వలసల సంఖ్య పెరిగింది.. కొందరు సందిగ్ధంగా ఉన్నారు.. పోలింగ్‌ నాటికి మరికొంత మంది సైకిలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అప్రమత్తమయ్యారు.

బెదిరింపులకు దిగుతున్న వైకాపా

  • వైకాపాను వీడే ఆలోచనలో ఉన్న వారిపై ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. కేసులుపెడతామంటూ హెచ్చరికలు పంపిస్తున్నారు. డోన్‌ మండలం చిన్నమల్కాపురానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి ఒకరు పార్టీ మారుతున్నారనే విషయం తెలిసి భయపెట్టారు. సదరు వ్యాపారికి చెందిన రెండు లారీలను విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో పట్టుకునేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని రోజులు లేనిదీ ఇప్పుడే అధికారులు దాడులు చేయడం ఏమిటని తెదేపా నాయకులు ప్రశ్నిస్తున్నారు.
  • డోన్‌ పట్టణంలో ఓ హోటల్‌ నిర్వాహకుడికి మండలంలోని ఓ గ్రామంలో మంచి పట్టుంది. తమవైపు రావాలంటూ ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ససేమిరా అనడంతో ఓ పోలీసు అధికారి రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని సదరు వ్యాపారి తెదేపా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
  • ప్యాపిలి మండలంలోని కలచట్లకు చెందిన ఓ నాయకుడు పార్టీ మారకుండా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది. తీరా పార్టీ మారడంతో ఆయనపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్యాపిలి మండలానికి చెందిన మరో నాయకుడు తెదేపాలోకి మారుతున్నారనే సమాచారంతో ఆయనపై ఒత్తిళ్లు తెచ్చినా...అతడు చివరికి కోట్ల వెంటనడుస్తామని తెగేసి చెప్పేయడంతో తమ పార్టీ అధికారంలోకి వస్తే సంగతి చూస్తామని కొందరు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని