logo

ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి

ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు.

Published : 27 Apr 2024 05:05 IST

ఐదేళ్లుగా భూమిపూజలతోనే సరి
ప్రయాణం సాహసమే

దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా.. అసంపూర్తిగానే మిగిలాయి. మళ్లీ ఎన్నికలొచ్చాయి.. దారులు మాత్రం వెక్కిరిస్తున్నాయి. ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని పలు రహదారులను ‘న్యూస్‌టుడే’ పరిశీలించింది.

మరుసటి రోజే శిథిలం

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర- బురుజుల గ్రామాల మధ్య రహదారి పూర్తిగా దెబ్బతినడంతో.. ఇటీవలే గుత్తేదారు కొంత మేర రోడ్డు విస్తరణ, కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. నిధులు లేకపోవడంతో గుత్తేదారు ఆసక్తి చూపడం లేదు. దీంతో వాహనదారులు గాయాలపాలవుతున్నారు.

నాణ్యత వెక్కిరింత

పత్తికొండ గ్రామీణం, ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: హోసూరు, మొలగవలి కొట్టాల రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని.. ఆ దారిలో సుమారు ఏడు కల్వర్టులు, హంద్రీవాగుపై ఓ వంతెన ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా ప్రారంభించారు. నిధులు చాలకపోవడంతో అసంపూర్తిగా వదిలేశారు.

108 వాహనాలూ వెళ్లవు..

ఆస్పరి, న్యూస్‌టుడే: డి.కోటకొండ నుంచి చిన్నపెండేకల్లు వరకు ఉన్న దారిని సుమారు పదేళ్ల కిందట రూ.1.80 కోట్లతో బీటీగా మార్చారు. ఇప్పటి వరకు నయాపైసా వెచ్చించ లేదు. వర్షాలకు రహదారి పూర్తిగా కోతకు గురై, దెబ్బతింది. రహదారి అధ్వానంగా మారడంతో బస్సు కూడా నిలిపివేశారు. అత్యవసర సమయంలో 108, ఇతర వాహనాలు సైతం రావడం లేదు.

వంతెన.. ఇంతేనా

తుగ్గలి: మారెల్ల నుంచి బొందిమడుగుల రహదారితో పాటు వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే, వైకాపా నాయకులు హడావుడిగా భూమి పూజ చేశారు. నెలలు గడుస్తున్నా.. నేటికీ ప్రారంభించలేదు. రహదారికి ఇరువైపులా ముళ్లపొదలు పెరిగి రాకపోకలు సాగించలేనంత దారుణంగా ఉంది. నాలుగున్నరేళ్ల కిందట భారీ వర్షాలకు వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఇంత వరకు నిర్మించలేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

ప్రతిపాదనలతోనే సరి

చిప్పగిరి: నేమకల్లు - తిమ్మాపురం రోడ్డుకు ఐదేళ్లుగా మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపుతున్నా.. చిల్లిగవ్వ కేటాయించలేదు. ఐదు కి.మీ. దూరం ఉన్న రహదారి అధ్వానంగా మారండంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల్లో ఇబ్బందులు పడుతూ ప్రయాణికులు వెళ్లి వస్తోంది. మజరా గ్రామమైన సంగాల - నేమకల్లు ఎస్సీ కాలనీ మధ్య 600 మీటర్ల మట్టి రోడ్డు నిర్మాణానికి 2022లో రూ.80 లక్షలు మంజూరు చేశారు. నిధులు రాకపోవడంతో మధ్యలోనే పనులు నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని