logo

ఊరికి దూరం.. అసౌకర్యాల భారం

గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ఉన్న రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కరవయ్యాయి.

Published : 01 May 2024 04:30 IST

చిప్పగిరి మండలంలోని నేమకల్లు రైల్వేస్టేషన్‌
చిప్పగిరి, న్యూస్‌టుడే: గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ఉన్న రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కరవయ్యాయి. ఊరికి దూరంగా ఉండటం.. పైగా ఒక ప్యాసింజరు రైలు మాత్రమే నిలుస్తుండటంతో ఉన్నా నిరుపయోగమేనని ఇక్కడి జనం పేర్కొôటున్నారు. హైదరాబాద్‌ రైల్వే సంఘం కమిటీ సలహాదారుగా ఉన్న ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పలు స్టేషన్ల సమస్యలపై దృష్టిసారించడం లేదు. చిప్పగిరి మండలంలో నాలుగు (నంచర్ల, నేమకల్లు, బంటనహాలు, మల్లప్ప గేట్‌) రైల్వేస్టేషన్లు ఉన్నాయి. గుమ్మనూరుతో పాటు హాలహర్వి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఈ స్టేషన్లు  ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లు  క్రాసింగ్‌ చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

దారి కూడా కరవే..

 నేమకల్లు రైల్వేస్టేషన్‌ గ్రామానికి 8 కి.మీ. దూరంలో ఉంది. పైగా పొలం దారి కావడంతో చినుకు పడితే చాలు బురదమయంగా మారుతోంది. స్టేషన్లకు మండలంలోని గ్రామాల పేర్లు పెట్టినప్పటికి ఆయా గ్రామాలకు దూరంగా ఉన్నాయి.  నంచర్ల గ్రామానికి రైల్వేస్టేషన్‌ 5 కి.మీ. దూరంలో ఉంది. సరైన రోడ్డు లేదు. గ్రామానికి కాస్త దగ్గరగా ఉన్న మల్లప్పగేట్‌ కూడా ఇటీవల డబుల్‌ లైన్‌ పనుల కారణంతో 2 కి.మీ.దూరంలో నూతన స్టేషన్‌ నిర్మించారు. ఇక్కడ ప్యాసింజరు రైళ్లను నిలపాలని ప్రజలు ఉద్యమించినా.. అధికారులకు చీమ కుట్టినట్లు లేదు. ప్యాసింజర్‌ రైళ్లను ఇక్కడ నిలిపితే బళ్లారి, గుంతకల్లు వెళ్లే వారికి వీలుంటుందని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.


 అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు
- లింగన్న, నంచర్ల

మండలంలోని నంచర్ల గ్రామానికి దగ్గరలో ఉన్న మల్లప్పగేట్‌ రైల్వేస్టేషన్‌లో గతంలో లాగా రైళ్లను నిలిపితే బాగుంటుంది. రైలు సౌకర్యం ఉన్నా... కొత్త స్టేషన్‌ నిర్మించి ప్యాసింజరు రైళ్లను నిలపడం లేదు. దీంతో రైలు ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని రైల్వే చీఫ్‌ ఇంజినీరు, గుంతకల్లు డీఎం, ప్రజాప్రతినిధులు, కలెక్టరు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మల్లప్పగేట్‌లో రైళ్లు నిలపని కారణంగా కర్నూలు, నంద్యాల, గుంటూరు, విజయవాడకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని