logo

అంకితభావంతో పనిచేయండి

‘‘పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి అందలం ఎక్కిస్తాం. ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాగానే పార్టీకి సేవలందించినవారికి సముచిత స్థానం ఇస్తాం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Published : 01 May 2024 04:37 IST

ఎవరి సేవలను విస్మరించం

తెదేపా శ్రేణులతో చంద్రబాబు

 ఈనాడు, కర్నూలు : ‘‘పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి అందలం ఎక్కిస్తాం. ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాగానే పార్టీకి సేవలందించినవారికి సముచిత స్థానం ఇస్తాం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆయన సోమవారం గూడూరులోనూ, మంగళవారం నందికొట్కూరులో తాను బసచేసిన ప్రాంతాల్లో పలువురు నేతలతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ పార్టీకి పనిచేసేలా మలచుకోవాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆయన  సూచించారు. విభేదాలు పక్కనపెట్టి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు.

 బాధ్యతలు విస్మరించొద్దు

 ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న ధీమాతో బాధ్యతల్ని విస్మరించకూడదని చంద్రబాబు హెచ్చరించారు. బూత్‌, యూనిట్, క్లస్టర్‌ స్థాయిల్లో ప్రతిఒక్కరూ వారివారి బాధ్యతలను సమర్థంగా పనిచేసేలా బాధ్యులను ప్రోత్సహించాలన్నారు. తెదేపా సూపర్‌-6 హామీలతో అన్నివర్గాలకు మేలు జరుగుతుందన్నారు. వైకాపా మ్యానిఫెస్టోకన్నా తెదేపా మ్యానిఫెస్టోతోనే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని.. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. మరిన్నిచోట్ల జయహో బీసీ సభలు ఏర్పాటుచేసి బీసీలకు తెదేపా ఎలా అండగా నిలబడుతుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పాలన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెదేపా పలు కీలక హామీలు ఇచ్చిందనేది అర్థమయ్యేట్లు వివరించాలని కోరారు.

సామాజిక న్యాయంపాటించాం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని వర్గాలవారికి రాజకీయ పదవులు చేరువ చేసేలా.. సామాజిక న్యాయం అందేలా సీట్ల కేటాయించినట్లు చంద్రబాబు చెప్పారు. కురుబలకు ఎంపీ, వాల్మీకులకు రెండు, ఈడిగలకు ఒకటి, లింగాయత్‌లకు ఒకటి, ఆర్యవైశ్యులకు ఒకటి, ముస్లింలకు ఒకటి చొప్పున అసెంబ్లీ టికెట్లు కేటాయించి అన్నివర్గాలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. నియోజకవర్గాల వారీగా నియమించిన ఎన్నికల పరిశీలకులు తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగి పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని.. అన్నివర్గాలు ఏకతాటిపై ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా లోపాలున్నట్లు గుర్తిస్తే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు మాట్లాడి నియోజకవర్గాల్లో పార్టీకి అత్యంత అనుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు క్రియాశీలంగా వ్యవహరిస్తూ జిల్లాలో నాయకులందరూ సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమన్వయం కీలకం

కూటమి పార్టీలైన జనసేన, భాజపా నాయకులు, శ్రేణుల సహకారం సంపూర్ణంగా ఉండేలా వారితో ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి పార్టీలన్నీ ఉమ్మడిగానూ, వారికి వారిగానూ ప్రచార కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఆదోనిలో భాజపా అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి విజయానికి తెదేపా నాయకులు కృషి చేయాలన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటేనే విజయం సాధించడం సునాయాసమవుతుందని పేర్కొన్నారు.

మహిళలకు ప్రాధాన్యం

మహిళలకు వైకాపా రెండు టికెట్లు (ఎమ్మిగనూరు, పత్తికొండ) సీట్లు మాత్రమే ఇచ్చిందని.. తెదేపా ఒక ఎంపీ (శబరి) రెండు ఎమ్మెల్యే సీట్లు (పాణ్యం-చరితారెడ్డి, ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ) కేటాయించి వారికి పెద్దపీట వేసిందన్నారు. మహిళా సాధికారతకు అగ్రప్రాధాన్యం ఇచ్చిన తెదేపాకు మహిళల మద్దతు దక్కేలా చూడాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని