logo

జగన్‌ జమానాలో ‘కూలి’న బతుకులు

ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్‌ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది..

Updated : 01 May 2024 05:37 IST

భవన నిర్మాణ కార్మికులపై నిర్లక్ష్య వైఖరి

 బోర్డు నిధులు పక్కదారి పట్టించిన సర్కారు

కణకణమండే.. గలగల తొణకే కార్మిక శక్తి లేకుంటే ఈ లోకంలో ఒక్క రోజు గడవదు. ప్రపంచ మనుగడే లేదు. కార్మికులకు ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్‌ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది.. కొత్త ప్రాజెక్టుల ఊసులేదు.. ప్రైవేటు నిర్మాణాల జాడ లేదు.. కూలి‘వెతల’ పాలనలో భవన నిర్మాణ కార్మికులు సమిధలయ్యారు.!
- న్యూస్‌టుడే, వెంకటరమణ కాలనీ

గద్దెనెక్కారు.. పస్తులుంచారు

వైకాపా సర్కారు వచ్చీ రాగానే నిర్మాణ రంగంపై కత్తి కట్టారు. ‘కొత్త ఇసుక విధానం’ పేరిట రీచ్‌లను మూసేశారు. ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. భవనాలు, ఇళ్ల పనులన్నీ ఆగిపోవడంతో కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరవైంది. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌తో వారికి మళ్లీ పని దూరమైంది. అలాంటి క్లిష్ట సమయంలో ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులకు పని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అర్ధాకలితో అలమటించేలా చేసింది.

సంక్షేమ నిధులు మళ్లింపు

భవన, నిర్మాణ రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఉంది. గుత్తేదారుల సెస్‌, సభ్యత్వ రుసుము రూపంలో ఏటా రూ.కోట్లు బోర్డుకు జమవుతాయి. దీనికి సమాన గ్రాంటు ఇచ్చి ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,70,750 మంది కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశారు. నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. శ్రామికుల సంక్షేమానికి భవన నిర్మాణదారుల నుంచి ప్రత్యేకంగా వసూలు చేస్తున్న 1 శాతం పన్ను మొత్తాన్ని నవరత్న పథకాలు, ఇతర అవసరాలకు వాడుకుంటోంది.

కార్మికులు               సంఖ్య
భవన నిర్మాణ రంగం    -   1,45,350
దుకాణాలు, హోటళ్లు     
-   50,000
కర్మాగారాలు           
-   23,500
నాపరాతి గనులు       
-  3,600
మట్టి, ఇతరాత్ర          
-  48,300


బీమా.. డ్రామా కార్మికులు సంఖ్య

ఒకే కుటుంబంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఉంటే ఎవరు చనిపోయినా సంక్షేమ బోర్డు నుంచి బీమా పరిహారం వస్తుంది. వైఎస్సార్‌ బీమాలో కుటుంబ పెద్ద చనిపోతేనే వర్తింపజేస్తారు. కొన్నిచోట్ల దంపతులు, వారి పిల్లలు భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారు. వీరి పేర్లు బోర్డులోనూ నమోదై ఉన్నాయి. ఇలాంటి కుటుంబాల్లో యజమాని చనిపోతేనే బీమా పరిహారం వస్తుంది. మిగతా వారికి వర్తించడం లేదు. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పైగా వారికి మేలు చేస్తున్నామన్నట్లు ప్రచారం చేసుకుంటోంది. కుటుంబ యజమాని కాకుండా కుటుంబంలోని ఇతరులకు ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం ఏర్పడినా పరిహారం అందడం లేదు. గతంలో బోర్డు నుంచి సహాయం ఇచ్చేవారు.

అంశం           పెండింగ్‌లో దరఖాస్తులు
వివాహ కానుక        -   17          
ప్రసూతి              - 4,881
ప్రమాదవశాత్తు మరణం - 33  
అంగవైకల్యం           -  0
సహజ మరణం        - 303
వైద్య సాయం         -  18
అంత్యక్రియలు         - 129


ఒక్కరికీ అందని సాయం

కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధుల నుంచి సాయం అందుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం కార్మికుల ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాల నమోదును మూడు నెలల్లోపు పూర్తి చేయాలని సూచించింది. ఈ పథకం కింద రూ.5 వేల చొప్పున సాయమందుతుందని ప్రచారం చేయడంతో వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రానికి రూ.189 కోట్లు అందినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కరికీ నగదు సాయం అందలేదు.

అందని పెళ్లి కానుక

భవన నిర్మాణ కార్మికులకు వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకాన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో 2019 నుంచి 2022 వరకు పెళ్లిళ్లు చేసుకున్న వేల మంది కార్మికుల పిల్లలకు బోర్డు నుంచి సహాయం అందలేదు. ఈ సహాయాన్ని రూ.లక్షకు పెంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, ఇందులో రూ.40 వేలు బోర్డే చెల్లిస్తోంది. వధువు పదో తరగతి చదివి ఉండాలన్న నిబంధన కారణంగా కొందరు సాయానికి దూరమవుతున్నారు.

ఎంతో మేలు చేసిన తెదేపా

తెదేపా హయాంలో భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి అదనపు ప్రయోజనాలను కల్పించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వివాహ కానుకను ముందుగా దరఖాస్తు చేసుకుంటే పెళ్లి రోజే అందజేసేవారు. ప్రసూతి సాయం అంటూ ప్రత్యేకంగా కార్మికుల కుటుంబాలకు అందించేవారు. పని ప్రదేశాల్లో చనిపోయినా, అంగవైకల్యం పొందినా బీమా మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకున్న వెంటనే అందించేవారు.  కార్మికుల సంక్షేమ బోర్డు నుంచే నిధులు పక్కాగా చెల్లించేవారు. రోజుల వ్యవధిలో క్లెయిమ్‌లు పరిష్కారమయ్యేవి. కార్మికులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇచ్చారు. కార్మికులు ఎన్నో ప్రయోజనాలు పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని