logo

పార్కు స్థలాల్లో నేతల పాగా

వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు..  పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు..

Published : 04 May 2024 04:46 IST

ఎన్నికల బహిష్కరణకు కాలనీవాసుల పిలుపు

ఈనాడు, కర్నూలు : వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు..  పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు.. నిబంధనల మేరక లేఅవుట్‌ (వెంచర్‌) వేసుకొన్నారు.. కాలనీలో పార్కుల ఏర్పాటుకు కొంత స్థలం వదిలేశారు. దాని విలువ ప్రస్తుతం రూ.108.75 కోట్లు ఉంటుంది.. నేతల కన్నేసి కబ్జా చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.. చేసేది లేక వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయొద్దని కాలనీవాసులు నిర్ణయించారు. కాలనీవాసులు బృందంగా ఏర్పడి పలు ఇళ్లకు వెళ్లి ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

స్థలం విలువ రూ.108.75 కోట్లు

నాలుగో తరగతి ఉద్యోగులు సంఘంగా (సొసైటీ) ఏర్పడి 1989లో నగర పరిధిలో సుమారు 82 ఎకరాలు కొనుగోలు చేశారు. నాలుగో తరగతి ఉద్యోగుల కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌’ పేరిట రిజిస్టర్‌ చేసుకొన్నారు. సదరు వెంచర్‌లో 1,300 ఇళ్ల స్థలాలకు హద్దులు వేశారు. సామాజిక అవసరాల నిమిత్తం 7.25 ఎకరాలు వదిలేశారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం రూ.108.75 కోట్లు పలుకుతోంది. అక్కడ నాలుగెకరాల విస్తీర్ణంలో ఒక పార్కు, 1.10, 1.15, 1.0 ఎకరాల్లో మరో మూడు పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వాటి అభివృద్ధికి నిధుల సమీకరించుకోవడంలో ఒకింత ఆలస్యమైంది. అధికార పార్టీకి చెందిన పలువురి ప్రజాప్రతినిధుల కళ్లు ఖాళీ స్థలాలపై పడింది. తొలుత కొందరు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఒకరిని చూసి మరొకరు పార్కు స్థలాలను కబ్జా చేశారు. ఆ కాలనీలో సుమారు పది వేల మంది నివాసం ఉంటున్నారు. ఉదయం, సాయంత్రం నడవడానికీ స్థలం లేకుండా పోయిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారం అండదండలు.. విన్నపాలు బుట్టదాఖలు

ఏవైనా ఫిర్యాదులు చేస్తే 21 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న ప్రభుత్వ పెద్దలు సైతం కాలనీవాసుల ఫిర్యాదులను పట్టించుకున్న పాపాన పోలేదు. పలువురు కాలనీవాసులు కాలనీ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేసినా అధికారుల్లో చలనంలేదు. కాలనీలోని పార్కు స్థలాన్ని కబ్జా చేసిన వారికి ‘అధికార’ పార్టీ నేతల అండదందలు ఉన్నాయి.. అందుకే అధికారులు ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఆక్రమించుకున్న కొందరు ఏకంగా నిర్మాణాలు చేసుకున్నారు. వారి కోసం అంతర్గత రహదారులు నిర్మించారు. విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాలు, పైపులైన్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగర మేయర్‌ బి.వై.రామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు అయినప్పటికీ ఆయనా పట్టించుకోకపోవడం గమనార్హం. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నగర్‌ మేయర్‌ బి.వై.రామయ్య, కార్పొరేషన్‌ కమిషనర్‌, కలెక్టర్‌తోపాటు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం వారు లేఖలు రాసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.

ఓటు వేయాలంటే పార్కు నిర్మించండి

కాలనీలోని పార్కులను రక్షించుకునేందుకు ఎన్నికలను బహిష్కరించడమే ఏకైక పరిష్కారమని కాలనీవాసులు భావిస్తున్నారు. స్థలాలను రక్షించాల్సిన అధికారులే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నారని... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న నేపథ్యంలోనే తాము ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించామని పేర్కొంటున్నారు. అప్పుడైనా అధికారులు తమ సమస్య పరిష్కరిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని