logo

ముమ్మాటికీ శిఖమే!

పట్టాదారులు కుంటలో మట్టి నింపి శిఖం భూమిలో వెంచరు ఏర్పాటుకు యత్నించిన వైనంపై బుధవారం ‘అదును చూసి ఆక్రమణలు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు.

Published : 23 May 2024 03:46 IST

గోధుమకుంటలో మట్టిని ఖాళీ చేయించిన అధికారులు

గోధుమకుంటలో వేసిన మట్టిని తీసి టిప్పర్‌లో తరలిస్తున్న దృశ్యం 

న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం : పట్టాదారులు కుంటలో మట్టి నింపి శిఖం భూమిలో వెంచరు ఏర్పాటుకు యత్నించిన వైనంపై బుధవారం ‘అదును చూసి ఆక్రమణలు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. నీటి పారుదల శాఖ ఏఈ మహేశ్‌ ఆధ్వర్యంలోని అధికారులు బుధవారం జడ్చర్ల పురపాలిక పరిధి బూరెడిపల్లిలోని గోధుమ కుంటను క్షేత్రస్థాయిలతో పరిశీలించారు. సర్వే చేసి మట్టిపోసిన ప్రాంతం ముమ్మాటికీ శిఖం భూమేనని స్పష్టంచేశారు. ఎఫ్‌టీఎల్‌(ఫుట్‌ ట్యాంక్‌ లెవల్‌)ను గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. పట్టాదారు శిఖం భూమిలో వేసిన మట్టి కుప్పలను అక్కడి నుంచి తీసివేయించారు. సాయంత్రం వరకు దాదాపు 25 లోడ్ల మట్టిని టిప్పర్లతో అక్కడి నుంచి తరలించారు. నీటి పారుదల శాఖ ద్వారా పట్టాదారుకు ఎలాంటి నిరభ్యంతర ధ్రువపత్రం జారీ చేయలేదని, నిర్మాణాలను అనుమతులు ఇవ్వకూడదని తహసీల్దారుకు, పురపాలిక కమిషనర్‌కు నీటి పారుదల శాఖ అధికారులు లేఖలు అందించారు. పట్టాదారుకు తాఖీదులు అందించటంతో అక్కడ వేసిన మట్టిని తొలగించారు. గోధుమకుంటలో తాము చేపల పంపకం చేపట్టి జీవిస్తున్నామని, ఇళ్ల స్థలాలు చేస్తే జీవనోపాధి కోల్పోతామని బూరెడిపల్లి మత్స్యసహకార సంఘం నాయకులు ఈనెల 15న అధికారులకు ఫిర్యాదు చేశారు. ‘ఈనాడు’లో కూడా కథనం ప్రచురితం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆదేశించడంతో నీటిపారుదల శాఖ ఏఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కుంటలో పూర్వ పరిస్థితి ఏర్పడిందని, ‘ఈనాడు’లో కథనం రాకుంటే రైతులు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు. కుంటలో 15.16 ఎకరాల శిఖం ఉందని అధికారులు నిర్ధారించినట్టు మత్స సహకార సంఘం నాయకుడు నర్సింహ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని