logo

దేవుడి భూముల రక్షణకు చర్యలు

మొదట సాగుచేసుకుంటారు.. అనంతరం నెమ్మదిగా తమ పేరుమీదికి మార్చుకుంటారు. అనంతరం అమ్మేస్తుంటారు. దేవాలయ భూముల విషయంలో జరుగుతున్న తంతు ఇది.

Published : 23 May 2024 03:57 IST

సాంకేతిక సమస్యలే అడ్డంకి

కర్నూల్‌ జిల్లా కల్లూరు శివారులో అలంపూర్‌ ఆలయాలకు సంబంధించిన భూమిని ఆక్రమించుకునేందుకు పలుమార్లు జరిగిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఇటీవల కొందరు యువకులు అందులో క్రికెట్‌ పిచ్‌ ఏర్పాటు చేయగా ఈవో పురేందర్‌ వెళ్లి దాన్ని తొలగింపజేశారు. ఇక్కడ ఎకరా దాదాపు
రూ.కోట్లలోనే పలుకుతోంది. ఇక్కడ 12 ఎకరాల దేవాలయ భూమి ఉంది. 


ధరూరు మండలం ద్యాగదొడ్డి శివారులో శివాలయానికి సంబంధించిన భూమి ఇది. సుమారు 19 ఎకరాలుంది. ప్రస్తుతం ఇది ఇతరుల చేతిలో సాగులో ఉంది. దేవాలయానికి ఎటువంటి ఆదాయమూ ఒనగూరడం లేదు. 
ధరూరు, అలంపూర్, న్యూస్‌టుడే: మొదట సాగుచేసుకుంటారు.. అనంతరం నెమ్మదిగా తమ పేరుమీదికి మార్చుకుంటారు. అనంతరం అమ్మేస్తుంటారు. దేవాలయ భూముల విషయంలో జరుగుతున్న తంతు ఇది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశాలు ఇవ్వటంతో మరో సారి వాటి రక్షణ అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. అనేక ఆలయాలకు సంబంధించిన భూములను గతంలో సంరక్షులుగా ఉన్నవారు రెవెన్యూ లొసుగులను ఉపయోగించుకొని అధికారుల అండతో ఓఆర్సీ పత్రాలను సృష్టించుకొని పట్టాదారులుగా మారిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరణి రికార్డుల ప్రకారం 15449.63 ఎకరాల భూములున్నాయి. వీటిలో 1,776 ఎకరాల వరకు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు. 
ధరణితో వెలుగులోకి: ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రానంత వరకు మిగులు భూములుగా ఉన్నవి రికార్డు పరంగా చాలా తక్కువ విస్తీర్ణంలో కనిపిస్తూ వచ్చాయి. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత దేవాలయ భూములను యథాతథ స్థితికి తీసుకొచ్చినమోదు చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాని ఆధారంగా ఉమ్మడి జిల్లాలో చాలా వరకు దేవాలయ భూములు సర్వేనంబర్‌తో సహా ధరణిలో దర్శనమిచ్చాయి. ఓఆర్సీల ఆధారంగా భూములు పొందిన వారు అమ్మేసుకున్న భూములు సైతం ఖాతా మార్పులు కానివి ధరణిలో దేవాలయ భూములుగానే కనిపిస్తున్నాయ. రికార్డుల్లో ఉన్నా ఆక్రమణదారులుగా మాత్రం ఆలయ అర్చకులు, సంరక్షకులు, ఆక్రమణదారులు, కౌలుదారులే కొనసాగుతున్నారు. రికార్డుల్లో మాత్రం దేవాలయ భూములుగా నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. వాటికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని మంత్రి ఆదేశాలు ఇవ్వటంతో ఆక్రమణదారుల్లో కలకలం మొదలైంది. 
సాంకేతిక అడ్డంకులు అధిగమిస్తేనే: ఇక దేవుడి పేరుతో ఉన్న భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఎవరి పేరుతో జారీ చేయాలన్నదే అసలు సమస్య అని రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులంటున్నారు. అమల్లో ఉన్న ధరణి పోర్టల్‌ నిబంధనల మేరకు ఆధార్‌ కార్డు ఐడీగా ఉంటే తప్ప పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయటం కుదరదు. ఒక వేళ దేవుడి పేరుతో పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా దేవుడికే ఆధార్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దేవుడి వేలిముద్ర తీసుకొని ఆధార్‌ ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదు. ఒక వేళ కస్టోడియన్‌గా దేవాదాయ అధికారుల పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలంటే నిబంధనల మేరకు కుదరని పరిస్థితి. ఇలా సాంకేతిక సమస్యలెన్నో ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలంటే నిబంధనల సవరణ తప్పనిసరి. రెండు రోజుల కిందట జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో కూడా ఈ అంశంపైనే సుదీర్ఘ చర్చజరిగినట్లు తెలిసింది. జిల్లా పాలనాధికారికి బాధ్యతలు అప్పగించి భూములకు కస్టోడియన్‌గా ఆయన పేరుతో పట్టాదారు పాసుపుస్తకం జారీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 


విధివిధానాలు రావాలి: దేవుడి భూములకు పట్టాదారు పాసుపుస్తకాల జారీ అంశంపై ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాణృ విధివిధానాలు రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఈ విషయమై ఓ క్లారిటీ వస్తుంది.

శ్రీనివాసరాజు, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు