logo

అంతా డొల్లతనమే

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేవు. ఓ పీఎంపీ నడుపుతున్నాడు. తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుడితో మాట్లాడి అతడికి అర్హత లేదని నిర్ధారించారు.

Updated : 26 Sep 2022 05:05 IST

నిబంధనలకు విరుద్ధంగా దవాఖానాలు, ల్యాబ్‌లు

 ఉమ్మడి జిల్లాలో సీజ్‌ చేసిన ఆసుపత్రులు 24 

న్యూస్‌టుడే, పాలమూరు, అచ్చంపేట న్యూటౌన్‌

మహబూబ్‌నగర్‌ : రాజేంద్రనగర్‌లో డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న

డీఎంహెచ్‌వో డా.కృష్ణ, అదనపు డీఎంహెచ్‌వో డా.శశికాంత్‌, అధికారులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేవు. ఓ పీఎంపీ నడుపుతున్నాడు. తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుడితో మాట్లాడి అతడికి అర్హత లేదని నిర్ధారించారు. అనుమతి కూడా లేకపోవడంతో ఆసుపత్రికి తాళం వేసి సీజ్‌ చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులలో కొన్నేళ్ల నుంచి ఓ వ్యక్తి క్లినిక్‌ నడుపుతున్నాడు. అతడు పదో తరగతి చదివిన ఆయన పేరు ముందు డాక్టర్‌ అని రాసుకున్నాడు. బీపీ చూడటం కూడా రావడం లేదు. క్లినిక్‌ రిజిస్ట్రేషన్‌ కాలేదు. వైద్యారోగ్యశాఖ అనుమతి లేదు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆ క్లినిక్‌కు సీజ్‌ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గుర్తింపు లేని ఆసుపత్రులను ఏర్పాటు చేసి అర్హత లేని వారు వైద్యసేవలు అందించి ప్రజల ప్రాణాలతో చెలాగాట మాడుతున్నారు. దీన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, రోగ నిర్ధారణ కేంద్రాలు, దంత వైద్యశాలలు తదితరాల్లో తనిఖీలకు ఈ నెల 21న ఉత్తర్వులను జారీ చేసింది. పది రోజుల గడువు ఇచ్చింది. ఈ పది రోజుల వ్యవధిలో అన్ని ఆసుపత్రులు, వైద్య సేవలను అందించే ఇతర తనిఖీ సంస్థలను తనిఖీ చేసి నివేదికలను పంపించాలని డీఎంహెచ్‌లకు ఆదేశాలను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు తనిఖీలు చేపట్టగా అనేక ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. వాటిని సీజ్‌ చేస్తున్నారు.

జిల్లాల వారీగా కార్యాచరణ

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 22 నుంచి అయిదు బృందాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ నెల 24 నుంచి నాలుగు బృందాలు తనిఖీలు చేపట్టాయి. నాగర్‌కర్నూల్‌లో నాలుగు ఆసుపత్రులు సీజ్‌ చేస్తే మహబూబ్‌నగర్‌లో ఒక్కదాన్నే సీజ్‌ చేశారు. వనపర్తి జిల్లాలో జిల్లాలో తనిఖీలనే ప్రారంభించలేదు. ఇక్కడ మూడు బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి కార్యాచరణ చేపట్టనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో, నారాయణపేట జిల్లాలో ఆరు ఆసుపత్రుల చొప్పున సీజ్‌ చేశారు.

తనిఖీలు లేకనే ఉల్లంఘనలు

వైద్యారోగ్యశాఖ నిబంధనల ప్రకారం జిల్లాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు, రోగ నిర్ధారణ కేంద్రాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య శాఖ అధికారులు తనిఖీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఆ ఆసుపత్రులు వ్యవహరిస్తే వాటిని వెంటనే సీజ్‌ చేయాలి. కానీ ఉమ్మడి జిల్లాల్లో అధికారులు తనిఖీలను అటకెక్కించటంతో అనేక ప్రాంతాల్లో పీఎంపీ(గ్రామీణ వైద్యులు)ల హవా నడుస్తోంది. నిబంధనల ప్రకారం వారు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. ఇంజక్షన్లు కూడా ఇవ్వకూడదు. తమ క్లినిక్‌లకు వచ్చిన రోగుల రక్త నమునాలను తీసుకొని వారే పరీక్షలు చేయించి రిపోర్టు ఆధారంగా చికిత్సలు కూడా చేస్తున్నారు. వారి వైద్యం వికటించి ప్రాణాలు కూడా పోతున్నాయి.

కఠిన చర్యలు తీసుకుంటాం

ఈ నెల 30వ తేదీలోగా ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు, రోగ నిర్ధారణ కేంద్రాల తనిఖీలు పూర్తి చేస్తాం. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. చిన్న సమస్యలు ఉన్నా ఆసుపత్రులకు నోటీసులను ఇస్తున్నాం. అర్హత లేకున్నా, అనుమతి లేకున్నా, రిజిస్ట్రేషన్‌ చేయకున్నా సీజ్‌ చేస్తున్నాం. రాజీపడబోము. - డా.చందునాయక్‌, డీఎంహెచ్‌వో, జోగులాంబ గద్వాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని