logo

ప్రయోగం.. అయోమయం

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ప్రయోగాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. విద్యార్థులు అధిక మార్కులు సాధించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయి.

Published : 22 Jan 2023 05:11 IST

పరికరాలు, రసాయనాలకు నిధులివ్వని సర్కారు
ఫలితాల్లో కొరవడుతున్న స్పష్టత

ప్రయోగ పరీక్షలు చేస్తున్న విద్యార్థులు (పాత)

న్యూస్‌టుడే, వనపర్తి: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ప్రయోగాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. విద్యార్థులు అధిక మార్కులు సాధించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయి. సబ్జెక్టు పరీక్షలు బాగా రాయడంతో పాటు ప్రయోగ పరీక్షలు సక్రమంగా చేస్తే నూరు శాతం మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఉన్నత చదువులతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. అంతటి ప్రాధాన్యమున్న వీటిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

రసాయనాల కొరత.. : ఉన్నత చదువులను నిర్దేశించుకునే క్రమంలో ప్రయోగాలపై సరైన అవగాహన లేకపోతే భవిష్యత్తుపై ఆ ప్రభావం తీవ్రంగా చూపుతుంది. జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగాలకు కావాల్సిన రసాయనాలు, పరికరాలు కొత్తవి సరఫరా చేయకపోవడంతో పరీక్షల సమయంలో కచ్చితమైన ఫలితాలు రాక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 58 ప్రభుత్వ జూనియరు కళాశాలల్లో మొత్తం 23,826 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కళాశాలల్లో భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులుగా ఎంచుకున్న విద్యార్థులకు ప్రయోగాలు తప్పనిసరి. ఒక్కో పరీక్షకు గరిష్ఠంగా 30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రయోగ పరీక్షల్లో ప్రతిభను చాటుకుని మార్కులు తెచ్చుకోవాలి. రసాయనాలు, పరికరాలకొరతతో ఎన్నిసార్లు ప్రయోగాలు చేసినా ఫలితాలు సక్రమంగా రావడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

రెండేళ్లుగా నిలిచిన సరఫరా.. : కరోనా విజృంభణతో రెండేళ్లుగా ప్రయోగ పరీక్షలకు అవసరమయ్యే రసాయనాలు, పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలకు సరఫరా చేయడంలేదు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో మూడు, నాలుగేళ్లుగా అందడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రయోగాలలో ప్రధానంగా అవసరమయ్యే బ్యూరెట్‌, పిప్పెట్‌, కోనికల్‌ గ్లాసు, బీకరు తదితర పరికరాలు కొన్ని కళాశాలల్లో ఉపయోగించడానికి వీల్లేనట్లుగా మారాయి. రసాయనాలలో తాజాగా ఉండాల్సిన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం అందుబాటులో లేవు. ఇవన్నీ పాతవి కావడంతో ఆమ్లాలలో గాఢత తగ్గిపోయి ఫలితాలు తారుమారవుతున్నాయి. రసాయన శాస్త్రంలో 24 లవణాలు ఉంటాయి. అవి కూడా తాజావి లేకపోతే వాటిల్లోనూ గాఢత తగ్గిపోయి ఫలితాలు ఆశించినట్లు రావడం లేదు. జీవ, వృక్షశాస్త్రాలకు సంబంధించి క్రొమటోగ్రఫీలో ఎసిటోన్‌, ఇథైల్‌ ఆల్కహాల్‌, నాఫ్తలీన్‌, పెట్రోలియం ఈథర్‌ ముఖ్యమైనవి. భౌతిక, రసాయనశాస్త్రాల ప్రయోగాల్లోనూ ఇవి ఉపయోగపడతాయి. ఆయా ఆమ్లాల సీసాల బిరడాలను ఒకసారి తీస్తే మరోసారి ప్రయోగానికి పనికిరావు. అలాంటిది ఏళ్ల తరబడి కొత్త రసాయనాలు అందకపోతే ప్రయోగాలు చేయడం ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.


నిధుల జాడ లేదు..

గతంలో ఒక్కో జూనియర్‌ కళాశాలకు ప్రయోగాల నిర్వహణ నిమిత్తం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రభుత్వం మంజూరుచేసేది. ఆ నిధులతో రసాయనాలు, పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కరోనా తీవ్రత ప్రారంభమైనప్పటి నుంచి ఈ నిధులను విడుదల చేయడంలేదు. దీంతో కళాశాల నిర్వాహకులే చిన్న చిన్న పరికరాలు, కిరోసిన్‌, డిస్టిల్‌ వాటర్‌, గ్యాస్‌ సిలిండర్లను సొంత డబ్బుతో కొనుగోలు చేస్తున్నారు. వాటితోనే అరకొరగా ప్రయోగ పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదలచేస్తే ప్రయోగాలు సజావుగా సాగుతాయని కళాశాలల ప్రిన్సిపాళ్లు,  ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అవసరమున్న చోట తెప్పిస్తాం.. : కరోనాకు ముందు ప్రభుత్వం నుంచి ప్రయోగాలకు అవసరమయ్యే రసాయనాలు సక్రమంగా వచ్చేవి. వైరస్‌ వ్యాప్తితో ఇవ్వడం లేదు. కొన్ని కళాశాలల్లో సరిపడా రసాయనాలు, పరికరాలు లేవని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. ఏయే కళాశాలల్లో ఇవి అత్యవసరమో తెలుసుకుని బోర్డుకు ఇండెంట్‌ పంపాం. ప్రయోగ పరీక్షలకు ముందే వీటిని తెప్పిస్తాం.

జాకీర్‌హుసేన్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి, వనపర్తి

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని