logo

ప్రగతిశీలం... ప్రజా క్షేమం

తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ల స్వల్పకాలంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని, అభివృద్ధి, ప్రజాసంక్షేమంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

Updated : 03 Jun 2023 05:51 IST

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం
దశాబ్ది ఉత్సవాల్లో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి

నారాయణపేట, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ల స్వల్పకాలంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని, అభివృద్ధి, ప్రజాసంక్షేమంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పేటలోని కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు. ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మొదట ఆమె జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం సీవకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లో వృద్ధిని సాధించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆమె వివిధ రంగాల ప్రగతిని వివరించారు.

జిల్లాలో వ్యవసాయానికి పెద్దపీట..

జిల్లాలో రైతుబంధు కింద 2018 నుంచి యాసంగి 2022 వరకు 1,65,873 మంది రైతుల ఖాతాల్లో రూ.1954 కోట్లను జమచేశారన్నారు.. 2014, 2018 సంవత్సరాల్లో జిల్లాలోని 1,09,862 మంది రైతులకు రూ.516.48 కోట్ల పంట రుణాలు మాఫీ చేశామన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు 3591 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.175.75 కోట్ల బీమా చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, రాయితీ విత్తనాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, సాగులోకి వచ్చిన భూములు వంటి విషయాలను గణాంకాలతో వివరించారు.

మహిళా ఆర్థికాభివృద్ధికి చేయూత....

2023-24 ఏడాదికిగాను బ్యాంకు లింకేజీ కింద 6469 సంఘాలకు రూ.218.60కోట్ల రుణ లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 119 సంఘాలకు రూ.9.25 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. రూ.83లక్షలు స్త్రీ నిధి రుణాలు మంజూరైనట్లు తెలిపారు. ధన్వాడ, నర్వ, మక్తల్‌, ఊట్కూరు, నారాయణపేట, దామరగిద్ద, మాగనూరు మండలాల్లో ట్రాక్టర్లు, డ్రోన్‌ స్ప్రేయర్లు రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేందుకు సీˆహెచ్‌సీˆ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధిహామీలో 2022-23 ఏడాదిలో రూ.1477.13లక్షలతో వివిధ పనులు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల్లో 334 క్రీడాప్రాంగణాలు పూర్తిచేశారన్నారు. 2023-24 సంవత్సరానికి ప్రభుత్వం 15లక్షల మొక్కల నాటేందుకు లక్ష్యం విధించుకున్నట్లు వివరించారు. కల్యాణలక్ష్మి కింద కులమతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం 14,212 పేద కుటుంబాలకు 133.88 కోట్లు, షాదీముబారక్‌లో బాగంగా రూ.19.75కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

బోరుబావులకు విద్యుత్తు కనెక్షన్లు

2014 నుంచి 2022-23 వరకు 19,314 మంది రైతుల బోరుబావులకు విద్యుత్తు కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, 17,393 బావులకు రూ.121.75 కోట్ల వ్యయంతో ఇచ్చామన్నారు.. గిరివికాసం పథకం కింద 133 బోరుబావులకు రూ.1.08 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో 64బోర్లువేసి 59 బావులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారన్నారు.

మన ఊరు-మనబడితో పాఠశాలల అభివృద్ధి

మన ఊరు- మనబడి కార్యక్రమంలో జిల్లాలో మొదటి విడతగా 174 పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. 49 పాఠశాలల్లో డిజిటల్‌ టీవీలతో 8, 9, 10 తరగతులను డిజిటల్‌ తరగతులుగా మార్చామన్నారు.. 72 పాఠశాలలకు సౌర ఫలకాలు రాగా, 24 పాఠశాలల్లో ఏర్పాటు చేశారన్నారు.

రూ.కోట్లతో రహదారుల అభివృద్ధి..

రూ.127.915 కోట్ల వ్యయంతో 93.710 కి.మీ రహదారులను రెండువరసలుగా మార్చామన్నారు.. రూ.17.45 కోట్లతో ఏడు వంతెనలు నిర్మించామని, రూ.47.15 కోట్లతో పేట పట్టణంలో 6.937 కి.మీ నాలుగు వరుసల రహదారి అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రూ.55 కోట్లతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం, వసతి గృహాల నిర్మాణం కోసం రూ.8.50 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయన్నారు. రూ.56 కోట్లతో 28.15 కి.మీ.ల అప్పక్‌పల్లి- కోయిలకొండ, అప్పక్‌పల్లి-గుండుమాల్‌ రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

31 క్వారీలతో ఖనిజ ఆదాయం...

నారాయణపేట, దామరగిద్ద, మరికల్‌, మద్దూరు, కోస్గిలలో 12 క్వారీలు , పేట,కోస్గి మండలాల్లో రెండు గ్రానైట్ క్వారీలు,  కంకర రాయికి సంబంధించిన 17 క్వారీలకు లీజులు మంజూరు చేశామన్నారు. 2021-22 సంవత్సరానికి రూ.306.65లక్షలు, 2022-23 ఏడాదికి రూ.504.48లక్షలు ప్రభుత్వానికి ఖనిజ ఆదాయం సమకూరుతుందన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ వనజమ్మ, కలెక్టర్‌ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రామకృష్ణ,ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, పురచైర్‌పర్సన్‌ అనసూయ, ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ జ్యోతి హాజరయ్యారు.

కలెక్టరేట్‌ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం

నారాయణపేట కలెక్టరేట్‌ వద్ద జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న రాష్ట్ర మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి,
చిత్రంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వనజ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని