logo

అందుబాటులోకి సైనిక్‌ భవన్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయం సమీపంలో కొత్తగా నిర్మించిన ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సైనిక్‌ భవన్‌ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

Published : 09 Jun 2023 03:53 IST

నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయం సమీపంలో కొత్తగా నిర్మించిన ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సైనిక్‌ భవన్‌ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శుక్రవారం ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికులు, వితంతువులు, పిల్లలు ఇక నుంచి ఈ కార్యాలయం నుంచి సేవలు పొందనున్నారు. రూ.1.75 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని నిర్మించింది. మూడంతస్తుల భవనంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంతోపాటు ఈసీహెచ్‌ఎస్‌ ఆస్పత్రి, ఆర్మీ క్యాంటీన్‌తోపాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే మాజీ సైనికులు సేదతీరేందుకు ఆరాంఘర్‌ను ఇందులో నిర్మించారు.

ఏళ్లుగా అద్దె భవనాల్లోనే..

సైనిక సంక్షేమ కార్యాలయం ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాల్లో నిర్వహించారు. అయిదేళ్ల కిందట ఈ కార్యాలయాన్ని జిల్లా పరిషత్తులోని రెండో అంతస్తులో నిర్వహిస్తున్నారు. జిల్లాకు పదేళ్ల కిందట ఈసీహెచ్‌ఎస్‌ ఆస్పత్రి, ఆరేళ్ల కిందట క్యాంటీన్‌ మంజూరు కాగా.. వాటిని పద్మావతీకాలనీలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సైనిక సంక్షేమ కమాండింగ్‌ అధికారుల చొరతో ఉమ్మడి జిల్లాకు ఒక కార్యాలయం క్యాంటీన్‌, ఈసీహెచ్‌ఎస్‌ ఆస్పత్రికి సొంత భవనం ఉండాలన్న ఉద్దేశంతో రవాణా శాఖ కార్యాలయం సమీపంలోని గ్రామీణ తహసీల్దారు భవన సముదాయంలో నిర్మించారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట నిర్మించారు. శుక్రవారం ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మాత్రమే ప్రారంభించనున్నారు.

వసతుల్లేని కారణంగా..

మూడంతస్తుల భవన సముదాయంలో పలు మౌలిక సదుపాయాలు లేవని ఇటీవల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వృద్ధులైన మాజీ సైనికులు మెట్లు ఎక్కలేరని, లిఫ్టు ఏర్పాటు చేయాలని, మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దీంతో ఈసీహెచ్‌ఎస్‌ ఆస్పత్రి, ఆర్మీ క్యాంటీన్ల ప్రారంభోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేశారు. లిఫ్టు తదితర సదుపాయాలు ఏర్పాటు చేశాక ఈసీహెచ్‌ఎస్‌, క్యాంటీన్లను ఇందులోకి మార్చనున్నారు. ప్రస్తుతం ఆ రెండూ పద్మావతీకాలనీలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని