logo

మృతిచెందిన యువతి గుర్తింపు

మహబూబ్‌నగర్‌ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు.

Published : 20 Apr 2024 04:03 IST

దంతవాడ లక్ష్మి

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం పర్వత్‌పల్లికి చెందిన దంతవాడ లక్ష్మి(26) పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీతో పాటు బీఈడీ పూర్తిచేసింది. మరో ఇద్దరు యువతులతో కలిసి మహబూబ్‌నగర్‌లోని రవి చిల్డ్రన్‌ ఆసుపత్రి సమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రోజూ మెట్టుగడ్డలోని జిల్లా గ్రంథాలయానికి వెళ్లి గ్రూప్‌-1కు సిద్ధమవుతోంది. బుధవారం పార్కుకు వెళ్లిన ఆమె చెట్ల మధ్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 90 శాతం శరీరం మంటల్లో కాలిపోయి ఉండటంతో ఆమె ఎవరో అధికారులు గుర్తించలేకపోయారు. ఆమెది ఆత్మహత్యనా.. ఇంకా ఏమైనా జరిగిందా అనే నిర్ధారణకు రాలేకపోయారు. ‘ఈనాడు’ వార్తలో యువతి మృతదేహం వద్ద లభించిన వస్తువుల ఫొటో ప్రచురితం కావడంతో ఆమె స్నేహితురాళ్లు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చి జనరల్‌ ఆసుపత్రిలోని మార్చురీలోని మృతదేహం చూసి గుర్తించి బోరున విలపించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. తాము వ్యవసాయం చేస్తామని, తమ కుటుంబంలో ఉన్నత విద్య చదివింది లక్ష్మి మాత్రమేనని, ఎప్పుడూ చురుకుగా ఉండేదని ఆమె తమ్ముడు వెంకటప్ప ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు లేవని, మృతికి కారణాలు తెలియటం లేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని