logo

అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Published : 20 Apr 2024 04:13 IST

న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం : అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. శనివారం బాలనగర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారుల తీరు, జరిగిన అక్రమాలను వెల్లడించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాలానగర్‌ మండలం కేంద్రంలో స్థిరాస్తి వ్యాపారులు పెద్దచెరువు, మత్తడికుంటలో నాలాలను పూడ్చి వేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచరు ఏర్పాటు చేయటంతో పాటు కుంటలో మట్టిని అక్రమంగా తీసుకొచ్చి పూడ్చివేశారని ఎమ్మెల్యే ఫిబ్రవరి నెల 27న అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఓ అధికారి వెంచరు నిర్వాహకులకు రూ.5.12 కోట్ల జరిమానా విధించారు. అదే అధికారి బదిలీపై వెళ్తూ అంతా సక్రమంగానే ఉందని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలియటం ఎమ్మెల్యేకు ఆగ్రహానికి గురిచేసింది. జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, నవాబ్‌పేట మండలాల్లోని రెవెన్యూ అధికారులు కూడా అక్రమార్కులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేనే గళమెత్తటం జడ్చర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని