logo

రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు

పట్టణంలోని జనరల్‌ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 30 Apr 2024 05:41 IST

నాగర్‌కర్నూల్‌ :  పట్టణంలోని జనరల్‌ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం

కందనూలు, న్యూస్‌టుడే: పట్టణంలోని జనరల్‌ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ, రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుత వేసవి కాలంలో రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రంలో రక్తపు యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువకులు స్వచ్ఛదంగా స్పందించి రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

అందుబాటులో 24 యూనిట్లు మాత్రమే

రక్తనిధి కేంద్రంలో ప్రస్తుతం 24 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎ పాజిటివ్‌ 1, బి పాజిటివ్‌ 2, ఓ పాజిటివ్‌ 21 యూనిట్లు ఉన్నాయి. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి జనరల్‌ ఆసుపత్రిగా ఏర్పడిన తరువాత జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన క్షతగాత్రులు వైద్యం నిమిత్తం జనరల్‌ ఆసుపత్రికి వస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు కొన్ని సందర్భంలో రక్తం ఎక్కిస్తున్నారు. జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం వల్ల గర్భిణులను ప్రసవాల నిమిత్తం జనరల్‌ ఆసుపత్రికి పంపిస్తున్నారు. ప్రతి రోజు 30 వరకు ప్రసవాలు నమోదు అవుతున్నాయి. గర్భిణీలకు సాధారణ ప్రసవాలు చేయడానికి వైద్యులు కృషి చేస్తున్న కొంత మంది గర్భిణీలకు రక్తం తక్కువగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా వైద్యులు రక్తం ఎక్కించి శస్త్ర చికిత్స, సాధారణ కాన్పులు చేస్తున్నారు. రక్తనిధి కేంద్రం నుంచి ప్రతి రోజు రోగుల పరిస్థితిని బట్టి 5 నుంచి 10 రక్తపు యూనిట్లు అందజేస్తున్నామని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న 24 యూనిట్లు వారం రోజులకు మాత్రమే సరిపోతాయని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆసుపత్రిలోని రోగులకు ఇబ్బందులు కలగకుండా యువకులు రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు.


యువకులు స్పందించాలి

ప్రస్తుతం రక్తనిధి కేంద్రంలో 24 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా రక్తపు యూనిట్లు అందజేస్తున్నాం. యువకులు స్వచ్ఛందగా స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి.

 డా.రోహిత్‌, రక్తనిధి కేంద్రం పర్యవేక్షకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని