logo

మైలారం గుట్టపై తవ్వకాలకు ససేమిరా

రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్‌ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్‌, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Published : 30 Apr 2024 05:45 IST

మైలారం గుట్టపై గుత్తేదారుడిని నిలదీస్తున్న ఆందోళనకారులు (పాత చిత్రం)

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే : రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్‌ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్‌, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. గుట్టపై పలుగురాళ్లను తవ్వేందుకు ప్రభుత్వం అనుమతిలివ్వడాన్ని స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో 2022లో అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పనులను తాత్కాలికంగా నిలిపేయించారు. ఇటీవల ఏప్రిల్‌ 4న పొక్లెయిన్‌తో గుట్టపైకి రహదారి ఏర్పాటు చేశారు. మరుసటి రోజు గ్రామస్థులు పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు.  అన్ని రకాల అనుమతులున్నాయని ఓ ప్రైవేట్‌ కంపెనీ నిర్వాహకుడు స్పష్టం చేస్తున్నారు.

 

మైలారం గుట్టపై పురాతన శివాలయం

అభ్యంతరాలు.. ఆందోళనలు : పలుగురాళ్ల తవ్వకాలు చేపడితే గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడటం ఖాయమని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పలుగురాళ్ల తవ్వకాల కోసం గుట్టపై రాళ్లను పేల్చితే గ్రామంలోని పశువులు భయాందోళనకు గురవుతాయని, ఇళ్లకు నెర్రెలు వచ్చి దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్ట పైనే సుమారు 150 ఇళ్లు, పశువులు, పురాతన ఆలయాలు ఉన్నాయని, తవ్వకాలు చేపడితే ప్రకృతి వినాశనం తప్పదని బాధిత గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23న గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలతో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. మైనింగ్‌, రెవెన్యూ అధికారులు తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే వరకు నిరంతర కార్యక్రమాలు చేపడుతున్నట్లు గ్రామస్థులు  పేర్కొంటున్నారు.


తవ్వకాలు చేపడితే అడ్డుకుంటాం

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గుట్టను పలుగు రాళ్ల కోసం తవ్వి ధ్వంసం చేస్తే ఊరుకోం. గుట్ట ఆధారంగా ఉన్న అరుదైన మొక్కలు, జింకలు, పందులు, కుందేళ్లతో పాటు వివిధ రకాల పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దుమ్ము, బ్లాస్టింగ్‌ శబ్దాలతో గ్రామంలోని ప్రజలు, మూగ జీవాలు భయాందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి. గ్రామస్థులందరి ఆరోగ్యం దృష్ట్యా మైనింగ్‌ తవ్వకాలను అడ్డుకుంటాం.

 చంద్రయ్య, మైలారం గ్రామస్థుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని