logo

ప్రశ్నార్థకం.. జలాశయాల నిర్మాణం

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది.

Published : 30 Apr 2024 05:59 IST

ఒక్క ఎకరాకూ సాగునీరందని వైనం 

అసంపూర్తిగా సంగాల జలాశయం అలుగు పనులు

గద్వాల, న్యూస్‌టుడే: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నదిగానే ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తోంది. పనులు పూర్తయ్యేదెన్నడో అధికారులకే తెలియని పరిస్థితి. ఏటా లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరిస్తున్నామని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇదంతా చెరువులు, బోరుబావులు కింద సాగవుతున్నదే తప్ప నెట్టెంపాడు కింద మాత్రం కాదన్నది అధికారులకు తెలిసిన సత్యమే. అయితే ఈ ప్రాజెక్టు కింద 101 ప్యాకేజి కింద రూ.51 కోట్లతో చేపట్టిన సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలది భిన్నమైన స్థితి. అప్పట్లో ఈ జలాశయాల ప్రతిపాదనే వివాదాస్పదంగానే మొదలైంది. పనులు పదేళ్ల ఆలస్యం వెరిసి అంచనాలు పెరిగి ఇప్పుడు రూ.85 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఈ ఏడాది కూడా పనుల పురోగతి కనిపించటం లేదు.

ఈ ఏడాది కూడా కష్టమే

వరస ఆటంకాలతో గుత్తేదారులు గతంలో చివరికి పనులే వదిలేసి వెళ్లిపోయారు. పదేళ్ల తర్వాత పనులు పూర్తచేయటానికి ప్రభుత్వం సమాయత్తమై వేరే గుత్తేదారులకు అప్పగించింది. అప్పట్లో భూములు కోల్పోయిన రైతులు చిన్నోనిపల్లి జలాశయం పనులు అడ్డుకోవటంతో ఆటంకాలు తప్పలేదు. తీరా పనులు మొదలు పెట్టినా పూర్తికాలేదు. జలాశయం వల్ల ప్రయోజనం లేదని మా భూములు మాకే ఇవ్వాలని కోరుతూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పది వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఎకరా ఆయకట్టుకు కూడా నీరివ్వలేదు. ఇక సంగాల జలాశయం కింద 0.50 టీఎంసీ నిల్వ కోసం 600 ఎకరాల భూములను రైతులు కోల్పోయారు. వారిదీ అదే పరిస్థితి. తాజాగా పదేళ్ల తర్వాత సంగాల జలాశయం అలుగు కాల్వ పనులు మొదలైనా అవి నత్తతో పోటీపడుతున్నాయి. ఈ జలాశయం నుంచీ ఇప్పటికి ఒక ఎకరం అయకట్టుకు కూడా నీరివ్వలేరు. కారణం అసలు ఆయకట్టే లేదు. ఉన్న ఆయకట్టంతా 99 ప్యాకేజీ కుడి కాల్వ కిందకు వస్తుంది. దాని కింద 29వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సంగాల జలాశయం కేవలం బ్యాలెన్సింగ్‌ రిజ్వాయర్‌గా ఉంటుంది. రూ.51 కోట్ల జలాశయాలు కేవలం మత్స్యకారులకు చేపల పెంపకం, స్టోరేజీ జలాశయాలుగా తప్ప ఆయకట్టుకు నీరిచ్చేవి కావని రైతుల వాదన. పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఈ ఏడాదైనా నీటిని నింపుతారో లేదోనని రైతులంటున్నారు. అధికారులు సైతం దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. గుత్తేదారులు మాత్రం పనులు పూర్తి చేస్తే నీటిని నింపుతామంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని