logo

పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?

పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 05 May 2024 06:47 IST

మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు
కొత్తకోట కూడలి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

కూడలి సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి, పక్కన ఎంపీ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

ఈనాడు, మహబూబ్‌నగర్‌- న్యూస్‌టుడే, కొత్తకోట: పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన డీకే అరుణ పాలమూరు పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్ష పదవిని తెచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా శనివారం ముఖ్యమంత్రి కొత్తకోటలో రోడ్‌ షో నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలోని చౌరస్తాలో జరిగిన కూడలి సమావేశంలో సీఎం ప్రసంగించారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డీకే అరుణ ఎందుకు అడగలేదన్నారు. మాదిగ వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడం లేదన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును కట్టాలని కేంద్రాన్ని ఎందుకు అడగలేదన్నారు. ఆర్డీఎస్‌ ద్వారా నీళ్లు ఇవ్వాలని ఏనాడైనా అడిగారా? భీమా, నెట్టెంపాడు, కోయిల్స్‌ాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని అడిగారా? పాలమూరుకు పరిశ్రమల కోసం ఎన్నడైనా కేంద్రాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డగా ఈ ప్రాంతాన్ని పార్టీలు, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే తన పదవిని తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గద్వాలలో కల్తీ మద్యం, కల్తీ కల్లు, అక్రమ క్రషర్‌, మైనింగ్‌ దందాలు చేసేదెవరో ఆమె చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్‌లో రైల్వే కోచ్‌, ఐటీ పరిశ్రమలకు గాడిద గుడ్డు చూపుతున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్‌లో మల్లు రవిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. తాను వనపర్తిలోనే చదువుకున్నానని, ఈ ప్రాంతంలో ప్రతి గల్లీ గురించి తనకు తెలుసన్నారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు మళ్లీ సీఎం అవకాశం వచ్చిందన్నారు. 2001లో చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారని ఆయన ముఖ్యమంత్రి కావాల్సి ఉందన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌ జైపాల్‌రెడ్డి, మల్లికార్జునగౌడ్‌, రామేశ్వేరరావు, మహేంద్రనాథ్‌ వంటివారు ఈ ప్రాంతంలో ఉన్నా వారికి సీఎం అవకాశం రాలేదన్నారు. ఇప్పుడు నేను సీఎం అయితే దించేయాలని ఆ ప్రాంతం వారు చూస్తున్నారని మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణ జరగాలన్నా, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా, ముదిరాజ్‌లు బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి రావాలన్నా పాలమూరులో కాంగ్రెస్‌ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో  ఎంపీ అభ్యర్థులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ప్రసాద్‌, జితేందర్‌రెడ్డి, మన్నె జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోట బస్టాండ్‌ చౌరస్తాలో సమావేశానికి హాజరైన జనం

ఇది ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక: వంశీచంద్‌రెడ్డి

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కాదు.. జిల్లా ఆత్మగౌరవానికి, రేవంత్‌రెడ్డి బలాన్ని దిల్లీలో చూపించే ఎన్నిక‘ అని మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఇది పాలమూరు భవిష్యత్తు తరాల కోసం జరిగే ఎన్నిక అన్నారు. కేంద్రంలో, భారాస, భాజపా పదేళ్లు అధికారంలో ఉండి మనల్ని బానిసలుగా చూశారని, పాలమూరు పౌరుషాన్ని చూపాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండదండలతో ఇక్కడ ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తామని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. 13న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయాలని కోరారు.

ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు: ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం చేశారని ఆ ప్రాజెక్టుకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి ఎదుట ప్రస్తావించారు. నియోజకవర్గంలో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు స్థాయిని పెంచి నీటి సామర్థ్యాన్ని పెంచాలని, దీనివల్ల ఎక్కువ మంది రైతులకు ఉపయోగం కలుగుతుందన్నారు. కొత్తకోట మండలంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంజూరైన భీమా ప్రాజెక్టు రెండో దశలోని శంకసముద్రం అప్పట్లోనే పూర్తికాగా కేవలం కుడి కాల్వకు నీటి విడుదల పనులు మిగిలాయని, ఇక్కడి కానాయపల్లి నిర్వాసితుల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. దీనివల్ల 10 గ్రామాలకు 20 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు. కొత్తకోటలో డిగ్రీ కళాశాల అవసరమని, ఉర్దూ మాధ్యమ కళాశాల అవసరం ఉందని తెలిపారు. దేవరకద్రలో 100 పడకలు, కొత్తకోటకు 50 పడకల ఆసుపత్రి కావాలని ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చామని వివరించారు. నియోజకవర్గంలో సుమారు 60 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని, రహదారి చుట్టూ పరిశ్రమల స్థాపనకు ఇండస్ట్రీ హబ్‌ను ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. సమావేశంలో నియోజకవర్గ నాయకులు జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్‌, అరవింద్‌రెడి, నాగిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీహరి, శెట్టిశేఖర్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్ర, నాగన్న, బీచుపల్లి యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని