logo

ఇక 3 రోజలే!

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో పాలమూరులో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌, భారాస, భాజపా మధ్య గట్టి పోటీ నెలకొంది.

Updated : 09 May 2024 06:40 IST

సమీపిస్తున్న పోలింగ్‌ తేది.. క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో పాలమూరులో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌, భారాస, భాజపా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి, భారాస- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, భాజపా- డీకే అరుణ పోటీ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ నుంచి మల్లు రవి, భారాస-ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, భాజపా- భరత్‌ ప్రసాద్‌ బరిలో ఉన్నారు. అభ్యర్థులు ఉదయం మార్నింగ్‌ వాక్‌లతో క్రీడా మైదానాల్లో ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో రచ్చబండల వద్ద సమావేశాలు ఏర్పాటు చేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు వచ్చి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

పన్నా కమిటీల ద్వారా..: మహబూబ్‌నగర్‌లో భాజపా అభ్యర్థి డీకే అరుణ ప్రచారం కొనసాగుతోంది. ఈ నెల 10న నారాయణపేటలో జరిగే మోదీ ఎన్నికల ప్రచారం ద్వారా మరింత జోష్‌ వస్తుందని ఆమె భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లోనూ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ పట్టణాలు, గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈనెల 11న వనపర్తికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వస్తుండటంతో ఈ సభను విజయవంతం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, పురపాలికలు, మేజర్‌ గ్రామపంచాయతీల్లో ప్రచారం చేశారు. గడువు దగ్గర పడటంతో ఇంటింటి ప్రచారంపై పార్టీ దృష్టి పెట్టింది. భాజపాలో ఉన్న పన్నా కమిటీలు, బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా జరుగుతున్న లబ్ధిని కరపత్రాల రూపంలో ముద్రించి పన్నా కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికి పంచి ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో యువకులు, మేధావులు, రైతులు, మహిళలతో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి మోదీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.  అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో స్థానిక పార్టీ నేతలతోపాటు శక్తి కేంద్రాల ఇంటింటి ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు.

ఇంటింటికీ ఆరు గ్యారంటీల ప్రచారం..: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లు రవిలకు ఇప్పటి వరకు పార్టీ అగ్రనేతలు రాహల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ రోడ్‌షో, కూడలి సమావేశాన్ని షాద్‌నగర్‌లో ఏర్పాటు చేశారు. ప్రియాంకగాంధీ పర్యటనతో శ్రేణుల్లో మరింత ఊపు వస్తుందని నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్‌లో పర్యటించనున్నారు. అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో పర్యటించకపోవడంతో ఈ మూడు రోజుల్లో సాధ్యమైన మేరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పోలింగ్‌ బూత్‌ల వారీగా  సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీ పథకాలపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లకు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉందని, రాబోయే రోజుల్లో మీకు కావాల్సిన హామీలను నెరవేర్చుతామని చెబుతున్నారు. గ్రామాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. వంశీచంద్‌రెడ్డి ఇప్పటికే ప్రధాన పట్టణాలతోపాటు మేజర్‌ గ్రామపంచాయతీల్లో తిరిగి వచ్చారు. మల్లు రవి నల్లమల్లతోపాటు నడిగడ్డలో ముఖ్య పట్టణాలు, గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

లబ్ధిదారులను కలుస్తూ..: భారాస అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రచారానికి పార్టీ అధినేత కేసీఆర్‌ వచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు మార్నింగ్‌ వాక్‌ ద్వారా పట్టణాల్లోని ఓటర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు. పలు గ్రామాల్లో ర్యాలీలు చేపట్టి రచ్చబండ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గద్వాల, అలంపూర్‌లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మిగతా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పోలింగ్‌ బూత్‌ల వారీగా సమవేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. రానున్న మూడు రోజుల్లో ప్రతి గడపకు వెళ్లి కరపత్రాలను పంచి ఓట్లు అభ్యర్థించాలనే ఆలోచనలో ఉన్నారు. వివిధ  సంఘాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. గత పదేళ్లలో గ్రామాలు, పట్టణాల్లో లబ్ధి పొందిన సంఘాలు, పజల వద్దకు వెళ్లి భారాసకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు కొన్ని గ్రామాల్లో  కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఇప్పటికే ప్రతి మండలంలో పర్యటించారు. నల్లమల అటవీ ప్రాంతం, నడిగడ్డతోపాటు మేజర్‌ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని