logo

మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్

కాంగ్రెస్‌ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

Updated : 10 May 2024 10:09 IST

  ధన్వాడలో మాట్లాడుతున్న డీకే అరుణ

ధన్వాడ, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం ధన్వాడలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మహిళనన్న కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. వీరి మాటల్ని ఖండించకపోగా నవ్వులు చిందిస్తున్న నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి తీరు విస్మయం కలిగించిందన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు మేనత్త డీకే అరుణ ఆశీస్సులున్నాయని చెప్పుకొని, ఇపుడు మేనమామను వెంటేసుకుని ఊరూరు తిరుగుతూ కించపర్చినవారితో అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. తన తండ్రి దివంగత నర్సిరెడ్డిని జైపాల్‌రెడ్డి అణగదొక్కారని, ఇపుడు ఆయన ఆల్లుడైన రేవంత్‌రెడ్డి తనను అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. నర్సిరెడ్డి వారసుల గౌరవాన్ని కించపరుస్తూ అణగదొక్కాలని చూస్తున్న వారిని పొలిమేర దాటించి, పరిగెత్తించడం ఖాయమని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారాన్ని చలాయిస్తున్న వారంతా చరిత్ర లేని వ్యక్తులన్నారు. ఆడబిడ్డను కించపర్చిన నాయకులకు లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మహిళల్ని కోరారు. ధన్వాడ వాసులు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్‌ కుటుంబం బాగుపడగా, రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీలతో కాంగ్రెస్‌ అబద్ధాలు ఆడుతోందన్నారు. సమావేశంలో డీకే అరుణ చెల్లెళ్లు సురేఖ, విద్య, కూతురు స్నిగ్థారెడ్డిలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు, భాజపా నాయకులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు నర్సన్‌గౌడ్‌, రాంచంద్రయ్య, ఉదయభాను, ఉమేశ్‌కుమార్‌, గోవర్ధన్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మాకం సురేందర్‌, లంకలి గోపిలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు