logo

సమీకృత నమూనా భవనాలకు మార్గం సుగమం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత మండలంగా మర్కూక్‌కు పేరుంది. ఈ మండల కేంద్రంలో రాష్ట్రానికే నమూనాగా ప్రభుత్వ భవనాలను నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారి

Published : 24 Jan 2022 01:05 IST

మర్కూక్‌లో స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు

సమీకృత భవనాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న స్మితాసబర్వాల్‌,

పాలనాధికారి హనుమంతరావు తదితరులు

ములుగు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత మండలంగా మర్కూక్‌కు పేరుంది. ఈ మండల కేంద్రంలో రాష్ట్రానికే నమూనాగా ప్రభుత్వ భవనాలను నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాలతో ఆదివారం సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి స్మిత సబర్వాల్‌, పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ శరత్‌, చీఫ్‌ ఇంజినీరు సంజీవరావు, పాలనాధికారి హనుమంతరావు, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, డీపీవో కౌసల్యాదేవి తదితరులు భవనాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. మర్కూక్‌- వరద రాజపూర్‌ గ్రామాల మధ్య సర్వే నెంబర్‌ 603లో ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. తహసీల్దార్‌, ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, విద్యాధికారి, ఎంపీవో, ఐకేపీ, విద్యుత్తు తదితర మండల స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలను ఇక్కడే నిర్మించనున్నారు. ఇందుకు 11 ఎకరాల భూమి సేకరించగా దాదాపు రూ.100 కోట్లతో నమూనా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. స్థల పరిశీలన అనంతరం అధికారుల బృందం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్‌ను కలిసి భవనాల నిర్మాణ నమూనాలను వారికి చూపించి ఆమోదం తీసుకున్నట్లు తెలిసింది.

‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం

ముందే చెప్పిన ఈనాడు...

కొత్తగా మండల కేంద్రంగా ఆవిర్భవించిన మర్కూక్‌లో నమూనాగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట నిర్మించాలని సీఎం కేసీఆర్‌ భావించారు. ఇందుకు ఆయన గతంలో స్వయంగా స్థలాన్ని సైతం పరిశీలించారు. ఇదే విషయాన్ని ఇటీవల ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఆదివారం ఉన్నత స్థాయి అధికారులు వచ్చి సమీకృత భవనాల నిర్మాణానికి మర్కూక్‌లో స్థలాన్ని పరిశీలించడంతో అది నిజమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని