logo
Published : 25 Jun 2022 01:25 IST

పల్లె పాలన.. సాంకేతికతకు దూరం

నామమాత్రంగా ఆన్‌లైన్‌ సేవలు

నిరుపయోగంగా కంప్యూటర్లు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మనూరు, కొండాపూర్‌

నాగల్‌గిద్ద మండలంలోని గ్రామ పంచాయతీలకు మంజూరైన కంప్యూటర్లను..  

ఎంపీడీవో కార్యాలయంలో వినియోగిస్తున్న తీరు..

ఈ ఒక్క మండలంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు. ఇది కంప్యూటర్‌ యుగం. ఏ రంగం చూసినా కాగిత రహితం దిశగా సాగుతుండగా గ్రామ పంచాయతీలు దీనికి దూరంగా ఉంటున్నాయి. ఆదాయ, వ్యయాలు, కొన్ని రకాల ధ్రువపత్రాలు మినహా మిగతా సేవలు ప్రజలకు అందడం లేదు. పంచాయతీ పాలనా.. అంతర్జాల సహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.

ప్రజాధనం దుర్వినియోగం: ఏడు సంవత్సరాల కిందట క్లస్టర్‌ పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేయగా అప్పటి నుంచి చాలా చోట్ల మూలకు చేరాయి. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులకు వాటిని ఉపయోగించుకునే పరిజ్ఞానం ఉన్నా అంతర్జాల సమస్య వేధిస్తోంది. అంతర్జాల సమస్య లేనిచోట కంప్యూటర్లు మరమ్మతులకు నోచని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఒప్పందం కుదురుకున్న సంస్థ జాడలేకుండా పోయింది. ఫలితంగా రూ.కోట్లాది ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.

సమస్యగా ‘వేతనాల’ నిబంధన: కంప్యూటర్లు ఇచ్చారు..ఆపరేటర్లను నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆపరేటర్లకు వేతనాలు గ్రామ పంచాయతీ నుంచే ఇవ్వాలన్న నిబంధన ఎంతవరకు సమంజసమని పలువురు సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి వచ్చేది విద్యుత్తు బకాయిలు, ట్రాక్టర్‌ వాయిదాలు, సిబ్బంది వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకే చాలడంలేదని వాపోతున్నారు.


‘కొండాపూర్‌ మండలంలో ఈ-పంచాయతీ సేవల అమలుకు 8 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ప్రభుత్వం కంప్యూటర్లు పంపిణీ చేసింది. ప్రింటర్లూ ఉన్నాయి. ప్రస్తుతం మల్లేపల్లి, మల్కాపూర్‌ క్లస్టర్‌ పంచాయతీల్లో మాత్రమే కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. మిగతా పంచాయతీల్లో అవి అలంకారప్రాయంగా మారాయి. ఆయా పంచాయతీలకు సమాచారాన్ని మండల పరిషత్తు కార్యాలయంలో ఆపరేటర్‌ ద్వారా కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయిస్తున్నారు.’


మండల కేంద్రాలకు వెళ్లాల్సిందే..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో.. అప్పట్లో 1,077 గ్రామ పంయచాయతీలు ఉండగా 574 క్లస్టర్లుగా విభజించారు. ప్రస్తుతం ఎక్కువ మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు మండల కేంద్రాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. క్లస్టర్‌ పంచాయతీల్లో ఉన్న వాటిలో కొన్ని కంప్యూటర్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. ఒక్కొక్క కంప్యూటర్‌ ఆపరేటర్‌ మండలంలోని 10 నుంచి 15 గ్రామాలకు సంబంధించిన సమచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. వీరికి వేతనాలు సర్పంచులు అందరు కలిసి చెల్లిస్తున్నారు. మండల పరిషత్తు కార్యాలయానికి సంబంధించిన ప్రగతి పనుల సమాచారాన్ని వీరే నిక్షిప్తం చేయాల్సి వస్తోంది. ఈ-పంచాయతీ సేవల్ని చేరువ చేయాలన్న సదుద్దేశంతో ప్రవేశపెట్టిన క్లస్టర్‌ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా పంచాయతీ వివరాలు పొందుపర్చడానికి మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో తమ అవసరాల కోసం ప్రజలు మండల కేంద్రానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇదీ పరిస్థితి

ఎంపిక చేసిన వాటిని క్లస్టర్‌ పంచాయతీలుగా 2015లో గుర్తించారు. క్లస్టర్‌ పంచాయతీలన్నింటికీ ప్రభుత్వం కంప్యూటర్లు పంపిణీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా పల్లె పాలనలో అంతర్జాల సేవల తీరు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఇప్పుడు మేజర్‌ పంచాయతీల్లో మినహా ఎక్కడా కంప్యూటర్లు వినియోగంలో లేవు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అలంకారప్రాయంగా మారాయి. పన్నులు, ఇతర సేవలకు రుసుంలు చెల్లిస్తున్న వారికి చేతిరాత రసీదులే ఇస్తున్నారు. ఇందులో ఎంతమొత్తం గ్రామ పంచాయతీ ఖాతాకు చేరుతుందన్నది ప్రశ్నార్థకమే..


వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు

-సురేష్‌ మోహన్‌, జిల్లా పంచాయతీ అధికారి

ఈ-పంచాయతీ సేవలు ప్రజలకు అందేలా చూస్తాం. నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కంప్యూటర్‌ ఆపరేటర్లకు వేతనాలు పంచాయతీలే భరించాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు ఉన్న చోట కంప్యూటర్‌ ఆపరేటర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. పంచాయతీలన్నీ అందుబాటులో ఉన్న ఆదాయ వనరులపై దృష్టి సారించాలి.
 

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts