logo

దృష్టి మరల్చి.. నగదు దొంగిలించి..

విదేశీ కరెన్సీ నోట్లు చూపించి.. అందుకు సరిపడా నగదు ఇవ్వాలని కోరుతూ.. వ్యాపారుల దృష్టిని మరల్చి.. నగదును దొంగిలిస్తున్న ఇరాన్‌కు చెందిన ముగ్గురి దొంగల ముఠాను మెదక్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 04 Oct 2022 02:56 IST

ముగ్గురు ఇరానీ దేశస్థుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు ఎస్పీ బాలస్వామి

మెదక్‌, న్యూస్‌టుడే: విదేశీ కరెన్సీ నోట్లు చూపించి.. అందుకు సరిపడా నగదు ఇవ్వాలని కోరుతూ.. వ్యాపారుల దృష్టిని మరల్చి.. నగదును దొంగిలిస్తున్న ఇరాన్‌కు చెందిన ముగ్గురి దొంగల ముఠాను మెదక్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్‌లోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సమావేశంలో ఎస్పీ రోహిణిప్రియదర్శిని వివరాలు వెల్లడించారు. ఇరాన్‌ దేశ రాజధాని తెహ్రన్‌కు చెందిన కరీం, ఇవాజీ నాదర్‌, బినియాజ్‌ బహ్మన్‌లు గత ఆగస్టులో దిల్లీకి వచ్చారు. అక్కడ కారును అద్దెకు తీసుకొని నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని కోకాపేటకు వచ్చారు. అక్కడి ఓ హోటల్‌ గదిలో ఉంటూ, జాతీయ రహదారులపై ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 11న, ఈనెల 1న రామాయంపేటలోని ఓ చికెన్‌ దుకాణం, చేగుటంలోని గ్యాస్‌ ఏజెన్సీ వద్దకు వచ్చి ఇరాన్‌కు చెందిన కరెన్సీ చూపి వాటి విలువకు తగ్గట్టు నగదు ఇవ్వాలని వ్యాపారులను కోరి, వారి దృష్టి మరల్చి దుకాణాల్లోని నగదును ఎత్తుకెళ్లారు. చికెన్‌ దుకాణంలో రూ.90 వేలు చోరీకి గురికాగా, తిరిగి నిందితులు మరోసారి పట్టణానికి రావడంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేగుంటలో ఇదే తరహా దొంగతనం బయటపడటంతో రామాయంపేట పోలీసులు దర్యాప్తును వేగిరం చేశారు. ఈ నెల 2న రామాయంపేటలో వాహనాలను తనిఖీ చేస్తుండగా డీఎల్‌ 6సీజే 7714 నంబరు గల కారులో సదరు వ్యక్తులు వెళ్తుండగా, అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. వాళ్లు పర్యాటక వీసాపై ఇండియాకు వచ్చారని, జాతీయ రహదారులపై ఉన్న దుకాణాల్లో దొంగతనం చేయడమే లక్ష్యంగా ఇక్కడ సంచరిస్తున్నట్లు తేలిందని ఎస్పీ వివరించారు. నిందితుల పాస్‌పోర్టులతో పాటు రూ.95 వేలు, 850 అమెరికన్‌ డాలర్లు, రూ.30.50 లక్షల విలువైన ఇరాన్‌ కరెన్సీ, మూడు చరవాణులు, ఇద్దరి డ్రైవింగ్‌ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముఠా సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ బాలస్వామి, తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని