logo

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

Published : 07 Feb 2023 04:14 IST

మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌, చిత్రంలో సీతారాంనాయక్‌, రాజ్‌కుమార్‌ జాదవ్‌, నాయకులు

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలం చౌడుతండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్‌సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాడినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. రిజర్వేషన్‌ శాతాన్ని 10కి పెంచారని, దీని అమలుకు ప్రత్యేక జీవో జారీ చేశారన్నారు. సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించేందుకు కృషి చేస్తానన్నారు. కేయూ విశ్రాంత ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ ఒకే భాష, ఒకే వేషధారణతో దేశవ్యాప్తంగా 17 కోట్ల గిరిజనులు ఉన్నారు. ట్యాంక్‌బండ్‌పై సేవాలాల్‌, ఠానే నాయక్‌ విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు అక్కన్నపేట నుంచి చౌడుతండా వరకు ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బంజారాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ రాజ్‌కుమార్‌ జాదవ్‌, తెరాస రాష్ట్ర కార్యదర్శి రూప్‌సింగ్‌, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్‌ తిరుపతినాయక్‌, ఎంపీపీలు మాలోతు లక్ష్మి, లకావత్‌ మానస, జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, లంబాడా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

సంప్రదాయ నృత్య ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని