logo

‘ఆహారశుద్ధి’.. అవకాశాలు వృద్ధి!

ఉమ్మడి తూప్రాన్‌ మండలంలో మరో పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మండలంలోని ఘనపూర్‌లో 308 ఎకరాల స్థలంలో ఆహారశుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 09 Jun 2023 06:12 IST

తూప్రాన్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు

ఘనపూర్‌లో రైతులకు చెక్కులను అందజేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, తూప్రాన్‌: ఉమ్మడి తూప్రాన్‌ మండలంలో మరో పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మండలంలోని ఘనపూర్‌లో 308 ఎకరాల స్థలంలో ఆహారశుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగానే రైతుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని 308 ఎకరాలను తీసుకోని, సాగులో ఉన్న వారికి ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని అధికారులు ప్రకటించారు. మొత్తం 308 ఎకరాలకు రూ.36.96 కోట్ల నగదు అంచనా వేయగా మొదటి విడతలో 163 ఎకరాలకు సంబంధించి 150మందికి రూ. 19.56 కోట్ల చెక్కులను అందజేశారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు తూప్రాన్‌ ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల అధికారులు కృషి చేస్తున్నారు.

మెండుగా సౌకర్యాలు..

ఉమ్మడి తూప్రాన్‌ మండలం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఘనపూర్‌ శివారులో 393, 441 రెండు సర్వే నంబర్లలోనే 308 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఒకే చోట ఉండడం వల్ల కంపెనీల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోనే అధికంగా ఉమ్మడి తూప్రాన్‌ మండలంలో వివిధ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. రవాణా, రైల్వే మార్గం అందుబాటులో ఉండడంతో భవిష్యత్‌లో రవాణాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైనుకు సమీపంలోనే ఈ పారిశ్రమికవాడ ఏర్పాటు కానుంది. అంతేకాకుండా తూప్రాన్‌ మండలంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతకు ఎంతో మేలు చేకూరుతుంది. వీలైనంత వరకు స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తే ఈ ప్రాంతం వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


50శాతం చెక్కుల పంపిణీ పూర్తి: శ్యామ్‌ప్రకాశ్‌, ఆర్డీవో తూప్రాన్‌

పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి 50శాతం రైతులకు మొదటి విడతలో చెక్కులు పంపిణీ చేశాం. తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల అధికారులు సిబ్బంది సమన్వయంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. వెంటనే ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తాం. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతోపాటు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని