logo

సారు.. కారులో సీటు ఎవరికో..!

శాసనసభ ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండటంతో అన్ని పార్టీల్లో కాక మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ సారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టేందుకు పావులు కదుపుతోంది.

Published : 20 Aug 2023 01:38 IST

శాసనసభ ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండటంతో అన్ని పార్టీల్లో కాక మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ సారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టేందుకు పావులు కదుపుతోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పార్టీ కార్యకలాపాల్లో దూకుడు పెంచింది. అత్యధిక శాతం సిట్టింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ వస్తున్న సీఎం కేసీఆర్‌.. గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈనెల 21న అధికార పార్టీ తొలివిడత జాబితా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మెతుకుసీమ జిల్లాలోని  పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, మెదక్‌, నర్సాపూర్‌

జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. స్వరాష్ట్రం వచ్చాక తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో మెదక్‌ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లోనూ వీరే పైచేయి సాధించారు. ఇలా వరుసగా రెండు సార్లు గెలుపొందగా, మూడోసారి తమకే అవకాశం చిక్కుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు పలువురు ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫలితంగా అభ్యర్థుల ఎంపికపై భారాస శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇక్కడి పార్టీ పరిస్థితులపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు.


మెదక్‌లో మారిన పరిస్థితులు..

2014లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ తొలి శాసనసభ ఉపసభాపతి పదవిని దక్కించుకున్నారు. హవేలిఘనపూర్‌ మండలం కూచన్‌పల్లికి చెందిన సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వరించింది. దీంతో ఆయన ప్రోటోకాల్‌పరంగా మెదక్‌ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు పూర్తిగా మారాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగడం, ఇప్పటివరకు మూడు విజయాలు, 9 ఏళ్లలో అభివృద్ధి తదితర కారణాలతో టిక్కెట్‌ తనకే వస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎంతో సాన్నిహిత్యం, ఎమ్మెల్సీ కోటాలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం తదితర అంశాల వల్ల టిక్కెట్‌ దక్కుతుందనే ఎమ్మెల్సీ శేరి భరోసాతో ఉన్నారు. ఈ తరుణంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్‌ కొంతకాలంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నేనూ పోటీలో ఉన్నానని సంకేతం ఇస్తున్నారు. పద్మ ఇప్పటికే పలుమార్లు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రోహిత్‌కు టిక్కెట్‌ విషయమై మైనంపల్లి మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి తిరిగి హన్మంత్‌రావుకే టిక్కెట్‌ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిల మధ్యే పోటీ ఉంటుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.


ఇద్దరిలో ఒక్కరికే..

నర్సాపూర్‌ నియోజకవర్గంంపై ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి దృష్టిసారించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి సునీతా లక్ష్మారెడ్డి భారాసలో చేరారు. ఆ తర్వాత ఆమెకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టారు. దీంతో ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెదేపాలో ఉన్నప్పటి నుంచి సీఎం కేసీఆర్‌తో ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సత్సబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్‌ కేటాయించాలని ఆయన సీఎంను కోరినట్లు సమాచారం. ఇటీవల సునీతాలక్ష్మారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి సీఎంను కలువగా, ఆ తర్వాత మదన్‌రెడ్డి నియోజకవర్గంలోని తన అనుచరులతో సహా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంతో సమావేశమయ్యారు. వృద్ధాప్యం కారణంగా మదన్‌రెడ్డిని తప్పించి, సునీతారెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాలనే యోచనలో అధిష్ఠానం ఉందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరే సమయంలో టిక్కెట్‌పై హామీ ఇవ్వడంతో, ఈసారి అవకాశం ఇవ్వాలని సునీతారెడ్డి అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈమెకు మంత్రి కేటీఆర్‌కు అండ ఉండగా, మదన్‌రెడ్డి మాత్రం సీఎం కేసీఆర్‌పై పూర్తి భరోసాతో ఉన్నారు. ఇక్కడా రెండు గ్రూపులు ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు, ఇతరత్రా వాటిల్లో కలిసి ముందుకు సాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని