logo

ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ..

ఆకాశం నుంచి ఉల్కలు పడ్డప్పుడు ఓ మంత్రపు పెట్టె దొరికిందని, దాంట్లో అద్భుత శక్తులు ఉన్నట్లు చెబుతూ పలువురిని మోసం చేస్తున్న నలుగురు నిందితులన జనగామ పోలీసులు అరెస్టు చేశారు

Updated : 05 Mar 2024 08:16 IST

 పెట్టెను చూపుతున్న ఏసీపీ దామోదర్‌రెడ్డి

జనగామ టౌన్‌: ఆకాశం నుంచి ఉల్కలు పడ్డప్పుడు ఓ మంత్రపు పెట్టె దొరికిందని, దాంట్లో అద్భుత శక్తులు ఉన్నట్లు చెబుతూ పలువురిని మోసం చేస్తున్న నలుగురు నిందితులన జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఏసీపీ దామోదర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఉంటున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మున్ననూర్‌కు చెందిన కేతావత్‌ శంకర్‌, నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం సంఘంబండకు చెందిన ఖాసీం, తాండూరుకు చెందిన మహ్మద్‌ అజార్‌, హయత్‌ నగర్‌లో ఉంటున్న నల్గొండ జిల్లా డిండి మండలం దేవత్‌పల్లి తండా వాసి.. కొర్ర గాసిరాం అలియాస్‌ గాస్యలు ఆదివారం ఆటోలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తుండగా, పెంబర్తి జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశా యి. మంత్రపు పెట్టె అని చెప్పి వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.50 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. సదరు పెట్టె కింది భాగంలో బ్యాటరీ వంటిది అమర్చినట్లు  దర్యాప్తులో తేలింది. దానిపై అయస్కాంతం పెట్టగానే అది వైబ్రేటింగ్‌ వచ్చేలా, ఇనుప వస్తువుతో రాయగానే నిప్పురవ్వల మాదిరిగా స్పార్క్‌ వచ్చేలా చేశారు. వీటిని తయారు చేసి పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. మంత్రపు పెట్టె, నాలుగు చరవాణులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు