PM Modi: రంజాన్‌ నెలలో బాంబింగ్‌ ఆపాలని ఇజ్రాయెల్‌కు చెప్పాను: మోదీ

రంజాన్‌ మాసంలో గాజాపై బాంబింగ్‌ ఆపాలని తాను ఇజ్రాయెల్‌ను కోరినట్లు ప్రధాని మోదీ చెప్పారు. 

Published : 17 May 2024 14:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పవిత్ర రంజాన్‌ మాసంలో గాజాపై వైమానిక దాడులను నిలిపివేయాలని తన ప్రతినిధి ద్వారా ఇజ్రాయెల్‌కు సందేశం పంపానని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. ఆయన ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘రంజాన్‌ మాసంలో నా ప్రత్యేక ప్రతినిధిని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వద్దకు పంపించాను. ఆ పవిత్రమాసంలో బాంబింగ్‌ చేయవద్దన్న నా సందేశాన్ని ఆయనకు చేరవేశాడు. వారు కూడా దానిని పాటించడానికే యత్నించారు. కానీ, చివరి రెండు మూడు రోజుల్లో ఘర్షణ జరిగింది. ముస్లింల అంశాలపై తనను ఇబ్బంది పెట్టినా.. ఇటువంటి విషయాలను వెంటనే బహిర్గతం చేయను’’ అని వెల్లడించారు.

తనలానే పలు దేశాలు కూడా బాంబింగ్‌ ఆపించే దిశగా ఇజ్రాయెల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశాయని వెల్లడించారు. వాళ్లకు ఫలితాలేమైనా వచ్చి ఉండొచ్చని.. తాను మాత్రం ప్రయత్నించినట్లు చెప్పారు. ఇక పాలస్తీనా, ఇజ్రాయెల్‌ పర్యటనల విషయంలో కూడా తాను మార్పు తెచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘గతంలో ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళితే.. పాలస్తీనాకు కూడా వెళ్లడం తప్పనిసరి. సెక్యూలరిజం చూపించుకుని.. తిరిగి వచ్చేవారు. కానీ అలా చేయడానికి నేను నిరాకరించాను. ఒక సారి నేను జోర్డాన్‌ గగనతలం పై నుంచి  పాలస్తీనాకు వెళుతున్న విషయం తెలుసుకుని ఆ దేశ రాజు నాతో మాట్లాడారు. మోదీజీ అలా వెళ్లకూడదు.. మీరు నా అతిథి. నా హెలికాప్టర్‌ వాడుకోవచ్చు అని చెప్పారు’’ అని ప్రధాని తెలిపారు. నాడు పాలస్తీనా పర్యటనకు జోర్డాన్ రాజు హెలికాప్టర్‌లో వెళ్లగా.. ఇజ్రాయెల్‌ విమానాలు దానికి రక్షణ కల్పించాయని గుర్తు చేసుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో మోదీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మోదీ ప్రస్తావిస్తూ.. 400 సీట్లు గెలుస్తామని ప్రజలే మాలో విశ్వాసం నింపారన్నారు. వాళ్ల దృక్పథం తనకు తెలుసన్నారు. ఇక హిందూ-ముస్లిం రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. వారి బుజ్జగింపు రాజకీయాలను బయటపెడుతున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని