logo

అనూహ్యం.. వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వం

ఎట్టకేలకు మెదక్‌ అభ్యర్థిని భారాస అధిష్ఠానం తేల్చింది. అనూహ్యంగా మాజీ ఐఏఎస్‌, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డి వైపు పార్టీ అధినేత కేసీఆర్‌ మొగ్గు చూపారు.

Updated : 23 Mar 2024 04:17 IST

న్యూస్‌టుడే-మెదక్‌, సిద్దిపేట: ఎట్టకేలకు మెదక్‌ అభ్యర్థిని భారాస అధిష్ఠానం తేల్చింది. అనూహ్యంగా మాజీ ఐఏఎస్‌, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డి వైపు పార్టీ అధినేత కేసీఆర్‌ మొగ్గు చూపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో చర్చించిన కేసీఆర్‌.. వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం... పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు భారాస కైవసం చేసుకోవడం, మెతుకుసీమకు సుపరిచితుడు కావడంతో టికెట్‌ వరించింది. ఈ స్థానానికి మొదటి నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ల పేర్లు వినిపించాయి. సొంత జిల్లా కావడంతో కేసీఆర్‌ సైతం పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనిల్‌కుమార్‌కు జహీరాబాద్‌ టికెట్‌ కేటాయించడంతో ఒకదశలో వంటేరుకు టికెట్‌ దాదాపు ఖరారైందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. చివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.

2002 నుంచి అనుబంధం

1996లో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికైన వెంకట్రామిరెడ్డి ఏపీలోని మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలలో ఆర్డీవోగా పనిచేశారు. 2002 -04 వరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డ్వామా పీడీగా, హుడా కార్యదర్శిగా, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా, ఇన్‌క్యాప్‌ మౌలిక వసతుల కార్పొరేషన్‌ ఎండీగా పనిచేశారు. 2007లో ఐఏఎస్‌ హోదా పొందారు. 2009లో ఉమ్మడి మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. 2014-16 మధ్య సంయుక్త కలెక్టర్‌గా కొనసాగారు. 2016 అక్టోబర్‌లో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల సమయంలో రాజన్న-సిరిసిల్ల కలెక్టర్‌గా, 2020 దుబ్బాక ఉపఎన్నికల సమయంలో సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ఉప ఎన్నికల తర్వాత తిరిగి సిద్దిపేట కలెక్టర్‌గా కొనసాగారు. 2021 నవంబర్‌ 15న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి భారాసలో చేశారు.  2021లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 సెప్టెంబరు వరకు ఆయన పదవీకాలం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించి, సునీతారెడ్డి గెలుపునకు కృషిచేశారు.

వ్యక్తిగత వివరాలు..

పేరు: పరుపటి వెంకట్రామిరెడ్డి
వయసు: 60
స్వస్థలం: ఇందుర్తి, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా
ప్రస్తుత నివాసం: తెల్లాపూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి
తల్లిదండ్రులు: రాజిరెడ్డి, పుష్పలీల
విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
కుటుంబం: భార్య ప్రణీతరెడ్డి, కుమారుడు భరత్‌రాజరెడ్డి, కుమార్తె రుత్వికరెడ్డి

మరోమారు సత్తాచాటాలని...

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిలో భారాస గెలిచింది. మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఈ స్థానంలో గెలుపు పక్కా అని భావిస్తున్న భారాస.. ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడ 2004 నుంచి వరుసగా విజయకేతనం ఎగురవేస్తున్న భారాస.. మళ్లీ సత్తాచాటాలని భావిస్తోంది. ఇప్పటికే భాజపా తరఫున రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని