logo

మహిళాభ్యున్నతికి సహకారం

సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి.

Published : 28 Mar 2024 01:36 IST

రాష్ట్రంలో ప్రథమ స్థానమే లక్ష్యంగా డీసీసీబీ అడుగులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, జోగిపేట

మహిళా సంఘం సభ్యుల సమావేశం

సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. వాణిజ్య బ్యాంకులకు దీటుగా పొదుపు సంఘాలకు రుణాల పంపిణీ చేస్తున్నారు. వసూలైన వడ్డీలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళా సంఘాలకు డీసీసీబీ ద్వారా రుణాల మంజూరులో మెదక్‌ డీసీసీబీ ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం సైతం అదే స్ఫూర్తితో ముందుకుసాగుతున్నారు.

రూ.415 కోట్లు పంపిణీ 

రాష్ట్రంలో 9 డీసీసీబీలు ఉన్నాయి. ఆయా బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా రూ.415.10కోట్లు పంపిణీ చేశారు. గత ఆర్థిక సంవత్సరం రుణాల పంపిణీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి ప్రభుత్వం నుంచి పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అర్హత గల అన్ని సంఘాలకు రుణాలు పంపిణీ చేయడంతో మరోసారి రాష్ట్ర స్థాయి పురస్కారం లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. రుణాల సద్వినియోగంపై నాబార్డు సహకారంతో మహిళలల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. 

బీమా పథకంతో..

ప్రధాన మంత్రి బీమా పథకాలను సహకార బ్యాంకుల ద్వారా సంఘాల సభ్యులకు అందిస్తున్నారు. ఏడాదికి రూ.12 చెల్లిస్తే ప్రమాద బీమా, రూ.330తో సాధారణ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.  ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.2లక్షలు, సాధారణ బీమా పథకంలో చేరిన వారు ఆత్మహత్య మినహా ఎలా మృతిచెందినా రూ.2లక్షలు, రెండు బీమా పథకాల్లో చేరితే రూ.4లక్షలు సాయం అందిస్తారు. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకునేలా చూస్తున్నారు.

వడ్డీ తిరిగివ్వడం ప్రత్యేకం

డీసీసీబీ బ్యాంకు పరిధి సంగారెడ్డి జిల్లాలోని మహిళా సంఘాలకు 2020 జూలై 1 నుంచి వసూలైన వడ్డీలో 5 శాతం తిరిగి సంఘాల అభ్యున్నతికి తిరిగి ఇస్తుండటం విశేషం. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై 12శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు. గతంలో డీసీసీబీ అధికారులు, సెర్ప్‌ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వసూలైన వడ్డీలో 5 శాతం చెల్లించేందుకు డీసీసీబీ అంగీకరించింది. ఇప్పటివరకు రూ.1.20కోట్లు జిల్లా సమాఖ్యకు అందజేశారు. డీసీసీబీ వెనక్కి ఇచ్చిన వడ్డీలో ఒక శాతం జిల్లా సమాఖ్య, రెండు శాతం మండల సమాఖ్యలకు, మిగతా రెండు శాతాన్ని గ్రామైక్య సంఘాలకు కేటాయించి సంఘాల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని