logo

డంపింగ్‌యార్డుల్లా ఖాళీ స్థలాలు!

పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన  వెదజల్లుతోంది.

Published : 29 Mar 2024 03:26 IST

పురపాలికల్లో ఇష్టారాజ్యంగా చెత్త పారబోత

తూప్రాన్‌ పట్టణంలోని ఓ ఖాళీ స్థలంలో పడేసిన చెత్త

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట: పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన  వెదజల్లుతోంది. ప్లాట్లను కొనుగోలు చేసి... ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని పురపాలికల్లో నెలకొన్న దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలోని నాలుగు పట్టణాలు రాజధానికి సమీపంలో ఉండడంతో రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో చాలా మంది ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల వరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. ఖాళీ స్థలం ఉండడంతో చెత్తను పారవేస్తున్నారు. కొందరు నిర్మాణాలు చేపట్టినా మురుగు కాల్వలు లేకపోవడంతో మురుగు నీరంతా ప్లాట్లలోకి వెళ్తోంది.

జరిమానాలేవీ..

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే బల్దియా సిబ్బంది ఇది వరకు జరిమానా విధించేవారు. గత కొన్ని నెలలుగా వేయ డం లేదు. దీంతో ఇష్టారాజ్యంగా చెత్తను వేస్తున్నారు. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదు. దీంతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. క్రమబద్ధీకరణతో ఇళ్ల నిర్మాణాలు జరిగితే సమస్య తీరుతుంది.

ఇదీ పరిస్థితి...

మెదక్‌ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రధాన రహదారి వెంట, పాత, కొత్త బస్టాండ్‌, దాయరకు వెళ్లే మార్గంలో సినీ మ్యాక్స్‌  థియేటర్‌ సమీపంలో పసుపులేరు వంతెన, రెండు పడకల గదుల వద్ద, దత్తాత్రేయ దేవాలయం సమీపం.. తదితర ప్రాంతాలలో పట్టణ ప్రజలు బహిరంగ ప్రదేశాలలో ఇష్టానుసారంగా వ్యర్థాలు వేస్తున్నారు. దీంతో పాటు ఔరంగాబాద్‌ అవుసులపల్లి సాయిబాబా  మందిరం, బృందావన్‌ కాలనీ, అంబేద్కర్‌ కాలనీ, గోల్కొండ, వెంకట్రావునగర్‌, సాయినగర్‌, రషీద్‌, బాబా, దుర్గా కాలనీ, దాయర తదితర ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ సరిగా లేక మురుగు ఆయా ప్రదేశాల్లోని ఖాళీ స్థలాల్లో చేరుతోంది. దీంతో దోమల బెడద పెరుగుతోంది.

  • తూప్రాన్‌ ప్రధాన కూడళ్ల వద్ద నిత్యం తెల్లవారుజామున చెత్తాచెదారం పారబోస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని కాలనీల్లో రెండు రోజులకు ఒకసారి చెత్త బండి తిరుగుతోంది. బండి రాని రోజు ఆరు బయటే వేస్తున్నారు.
  • చెత్త బండి రావడానికి ఆలస్యమైతే రామాయంపేట మల్లెల చెరువు, పాండ చెరువు సమీపంలోని వారు సమీపంలోని చెరువుల్లో వ్యర్థాలు పడేస్తున్నారు.
  • నర్సాపూర్‌ పట్టణంలో ఛైర్మన్‌ అశోక్‌గౌడ్‌ వార్డుల బాట పట్టి ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా నిరోధిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని