logo

గూడు పూర్తికాక.. నీడ లేక

గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి.

Published : 19 Apr 2024 02:05 IST

అసంపూర్తిగా రెండు పడక గదుల ఇళ్లు

కోర్విపల్లిలో నిరుపయోగంగా వదిలేసిన ఇళ్లు

న్యూస్‌టుడే, చిన్నశంకరంపేట: గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. చిన్నశంకరంపేట మండలం కోర్విపల్లి గ్రామంలో నాలుగేళ్ల 20 రెండు పడక గదుల ఇళ్లను గత ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ అక్కడ కేవలం 10 ఇళ్లను పాక్షికంగా నిర్మించి వదిలేశారు. అప్పటి నుండి నేటి వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదు. అసంపూర్తిగా వదిలేసిన భవనాలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్థులు తెలిపారు. గతంలో కామారం, మిర్జాపల్లి శివారుల్లో 2021 జనవరిలో 80మంది లబ్ధిదారులను గుర్తించి 72 మందికి రెండు పడక గదుల ఇళ్లను అందించారు. మిగతా 8 మందికి నేటికీ అందలేదు. మండల వ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం మూడు గ్రామాల్లోనే తూతూమంత్రంగా ఇళ్లను మంజూరు చేశారు. మిగతా గ్రామాల్లో ఎందుకు మంజూరు చేయలేదని అప్పట్లో అధికారులను ప్రజలు ప్రశ్నించినా పట్టించుకోలేదు. గ్రామాల్లో కనీసం నిలువ నీడలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. వీరు గత్యంతరం లేక పూరి గుడిసెల్లో జీవిస్తున్నారు. కనీసం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అయినా అసలైన లబ్ధిదారులను గుర్తించి రెండు పడక గదుల ఇళ్లను అందించాలని మండల వాసులు కోరుతున్నారు. ఇళ్లు లేక కొన్ని తండాల్లో నేటికీ పూరి గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని