logo

పంచాయతీ నుంచి లోక్‌సభకు..

ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు.

Published : 26 Apr 2024 01:28 IST

ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. సర్పంచి నుంచి ఎంపీగా ఎదిగి సత్తా చాటిన ఈయన స్వగ్రామం జహీరాబాద్‌ మండలం మల్‌చెల్మ. 1952లో సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1957లో జహీరాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. వెనుతిరిగి చూసుకోలేదు. వరుసగా 1985 వరకు ఏడుసార్లు ఆయనే ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. పలు మంత్రివర్గాల్లో భారీపరిశ్రమలు, పంచాయతీరాజ్‌, రవాణా, నీటిపారుదల శాఖల మంత్రిగా పని చేశారు. 1984లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 1991, 1996, 1998లలో జరిగిన ఎన్నికల్లోనూ విజయాలు అందుకున్నారు. 1991 నుంచి 96 వరకు రైల్వే కన్వెన్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా, 1989-1994 వరకు ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌లో 1972-73లో నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌ను బాగారెడ్డి ప్రారంభించగా.. ప్రస్తుతం అది ట్రైడెంట్‌ పరిశ్రమగా సాగుతోంది. ఈయన హయాంలో పలు పరిశ్రమలను స్థాపించారు. సేవలకు గుర్తుగా సింగూరు ప్రాజెక్టును యం.బాగారెడ్డి పేరిట నామకరణం చేశారు.

న్యూస్‌టుడే, జహీరాబాద్‌


మూడు నియోజకవర్గాల అనుబంధం

పెద్దశంకరంపేట.. మెదక్‌ జిల్లాకు సరిహద్దు మండలం. దీని పరిధి విభిన్నంగా ఉండటం గమనార్హం. ఈ మండలం మెతుకుసీమ జిల్లా పరిధిలోకి వస్తుంది. శాసనసభ నియోజకవర్గం నారాయణఖేడ్‌ కాగా, పార్లమెంటరీ స్థానం జహీరాబాద్‌లో ఉండటం వైచిత్రం. స్వాతంత్య్రం అనంతరం 1952 నుంచి 1962 వరకు అందోలు నియోజకవర్గంలో కొనసాగింది. ఆ తర్వాత మారిన సమీకరణాలు, జనాభా ప్రతిపాదికన 1962లో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోకి మారింది. అప్పటి నుంచి 40 ఏళ్లకు పైగా ఈ నియోజవర్గంలోనే కొనసాగింది. అప్పటివరకు మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉన్న పేట మండలం 2009లో నారాయణఖేడ్‌ అసెంబ్లీ, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోకి మారింది. మున్సిఫ్‌ కోర్టు, ప్రాంతీయ ఆస్పత్రి విభాగం, ఎస్టీఓ వంటి శాఖలు అందోలు పరిధిలో ఉన్నాయి. నీటిపారుదల, పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలు మెదక్‌ కేంద్రంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం, అగ్నిమాపక శాఖ విభాగం ఖేడ్‌తో అనుబంధం కొనసాగుతోంది.

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట


6 శాతం ఓట్లు వస్తేనే..

తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలని ఎక్కడో ఒక చోట చదువుతుంటాం, వింటుంటాం. ఎన్నికల ప్రచారాల్లో కూడా ఈ పదాలను నాయకులు వాడుతుంటారు. జాతీయ పార్టీలు దేశ రాజధాని కేంద్రంగా పాలిస్తాయని.. ప్రాంతీయ పార్టీలు స్థానికంగా ఉంటాయని చెబుతుంటారు. ఏ పార్టీ అనేది కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేకంగా గుర్తులను కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లోని పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు వస్తే జాతీయ పార్టీగా గుర్తిస్తారు. ఒక రాష్ట్రంలో 6 శాతం ఓట్లు వస్తే ప్రాంతీయ పార్టీగా చెబుతారు. సిద్ధాంతపరంగా కానీ, వ్యక్తులతో పార్టీ చీలిపోయినప్పుడు పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడినప్పుడు ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది.

న్యూస్‌టుడే, పాపన్నపేట


సామాజిక మాధ్యమాల్లో జోష్‌

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఆ సందడే వేరు. హంగు ఆర్భాటాలు.. ఊరురా ర్యాలీలు, మైకుల హోరు, ప్రచార వాహనాల జోరు.. ఇలా ఏ పల్లెలో చూసినా కనిపించేవి, వినిపించేవి. ప్రస్తుతం ఈ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ర్యాలీలు, కార్నర్‌ మీటింగ్‌లకు అగ్రనాయకులను రప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తారు. పట్టణాల్లో ఉదయం నడకలో యువతను పలకరిస్తున్నారు. ఇంటింటి ప్రచార బాధ్యతను స్థానిక నేతలే చూసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
చేరువయ్యేలా.. ఉమ్మడి మెదక్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల పరిధిలో కొనసాగుతోంది. ఆయా చోట్ల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు స్మార్ట్‌ ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థుల పేరిట గ్రామాలు, మండలాల వారీగా ఖాతాలు తెరిచి సంక్షిప్త సందేశాలు, మీమ్స్‌, చిన్న వీడియోలు రూపొందించి ఓటర్లకు పంపిస్తున్నారు. అభ్యర్థుల వాయిస్‌ కాల్స్‌తోనూ ఓటర్లకు చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు.
ప్రత్యేకంగా సైన్యం.. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు ప్రచార తీరుతెన్నులను షేర్‌ చేసేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు సోషల్‌ మీడియా సైన్యాన్ని నియమించుకున్నారు. అభ్యర్థుల ప్రచారాలకు సంబంధించి ఆకట్టుకునేలా సందేశాలు రూపొందిస్తున్నారు.

న్యూస్‌టుడే, రామాయంపేట, మిరుదొడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని