logo

ఫలితం లేదు..

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా..

Published : 26 Apr 2024 01:36 IST

కళాశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నా ఇంటర్‌ ఉత్తీర్ణతలో వెనుకే

నిరుపయోగంగా  ప్రయోగ పరికరాలు

మెదక్‌ టౌన్‌, చేగుంట, తూప్రాన్‌, వెల్దుర్తి, రామాయంపేట, శివ్వంపేట, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 28, ద్వితీయ సంవత్సరంలో 31వ స్థానంలో నిలిచింది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఆశించి స్థాయిలో ఫలితాలు రావడంలేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ కళాశాలలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ప్రతి దానిలో ఏదో ఒక సమస్య వేధిస్తుండటం ప్రధాన కారణం.  

5 కళాశాలల్లో దారుణం

జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 ప్రభుత్వ కళాశాలలు ఉండగా అందులో చివరి నుంచి తూప్రాన్‌-15.29 శాతం, చేగుంట-23.44శాతం, శివ్వంపేట-27.27శాతం, వెల్దుర్తి-30.1శాతం, రామాయంపేట-30.77 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాయి. తూప్రాన్‌లోని కళాశాల గతం ఏడాది సైతం చివరి నుంచి 2వ స్థానంలో 22.08 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రస్తుతం ఇంకా దిగజారి 15.29శాతానికి పడిపోయి జిల్లాలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.


13 మందే పాస్‌: జిల్లాలోని పెద్ద పట్టణాల్లో ఒకటైన తూప్రాన్‌ రెండేళ్ల నుంచి అట్టడుగు స్థానంలో ఉంటోంది. ఈ ఏడాది 85 మంది విద్యార్థులు పరీక్ష రాయగా కేవలం 13 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ సొంత భవనంతో పాటు అదనపు గదులు, అన్ని రకాల సదుపాయాలు, సరిపడా సిబ్బంది ఉన్నప్పటికీ 15.29 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. విద్యార్థుల హాజరు శాతం, అధ్యాపకుల బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర వాటిల్లో పూర్తిగా అలసత్వం వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చేగుంటలో 23.44శాతం: చేగుంటలో రెండు అంతస్తుల్లో అందమైన భవనం ఉంది. దీంతో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, సదుపాయాలు ఉన్నా.. ఫలితాల్లో మాత్రం వెనకబడింది. విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకాకపోవడంతో పాటు బోధన సరిగా సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే నార్సింగి మండలంలోని కళాశాలకు సొంత భవనం లేకున్నా.. 92శాతంతో జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది.


చెట్ల కింద పాఠాలు: శివ్వంపేట కళాశాలలో ద్వితీయలో 33మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 9మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. సొంత భవనం, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2008లో కళాశాలను ప్రారంభించగా ఇంతవరకు పక్కా భవనం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3 గదులను కేటాయించారు. అందులోనే కార్యాలయం, ల్యాబ్‌, బోధన జరుగుతోంది. కొన్నిసార్లు చెట్ల కింద పాఠాలు చెప్పాల్సి వస్తోంది. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో కలిపి మొత్తం 59 మంది ప్రవేశం పొందగా సరైన సౌకర్యాలు లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరవుతున్నారు. 9 ఏళ్ల క్రితం పక్కా భవనానికి రూ.10 కోట్లు మంజూరవగా.. ఇంతవరకు స్థల పరిశీలన సైతం పూర్తి కాలేదు.
ప్రత్యేక తరగతులు నిర్వహించినా: ఉత్తీర్ణతలో జిల్లాలో చివరి నుంచి వరుసగా వెల్దుర్తి 4, రామాయంపేట 5వ స్థానాల్లో ఉన్నాయి. ఈ కళాశాలల్లో అన్ని సదుపాయాలు, అధ్యాపకులు, మౌలిక వసతులు ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. స్టడీ మెటీరియల్‌ అందించి, ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని