logo

రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాకు చెందిన సీనియర్‌ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు.

Updated : 02 May 2024 06:36 IST

న్యూస్‌టుడే, గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాకు చెందిన సీనియర్‌ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు.

  • సముచిత స్థానం దక్కటం లేదని ఆరోపిస్తూ  సిద్దిపేట మున్సిపాలిటీలోని కొందరు కౌన్సిలర్లు మరో పార్టీలో చేరారు.
  • పార్టీ పదవులతోపాటు పెద్ద ఎత్తున నగదు ఇస్తామన్న భరోసాతో గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు పార్టీ మారినట్లు ప్రచారం సాగుతోంది.
  • వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో  పెట్టుకుని సర్పంచితోపాటు ఎంపీటీసీ, ఎంపీపీ పదవులపై కన్నేసిన దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు అధికార పార్టీలోకి చేరారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గజ్వేల్‌ మండలంలోని ఓ యువ నాయకుడు సర్పంచి పదవి ఆశించి.. గ్రామంలో పలువురు పార్టీ మారుతున్నట్లు గ్రహించి అతనే ముందుగా వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది.

పార్లమెంటు ఎన్నికల వేళ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో కండువాలు మార్చుతున్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న పార్టీ పెద్దలు వారిని అక్కున చేర్చుకుని పావులు కదుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించి విజయాన్నందుకోవాలన్న లక్ష్యంతో ప్రధానపార్టీల నేతలు చేరికలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజూ చేరికలు ఉండేలా  ప్రధాన పార్టీల నేతలు చూసుకుంటున్నారు. ప్రత్యర్థి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే వ్యూహంగా ఉంటున్నారు.

అటూఇటూ అయితే అంచనా ఎటు!

అంది వచ్చే ప్రతి అంశాన్ని వినియోగించుకుంటూ భారాస చేరికలను ఆహ్వానిస్తుండగా ముఖ్య నాయకులను టార్గెట్‌ చేసుకుంటూ కాంగ్రెస్‌, భాజపాల నేతలు పావులు కదుపుతున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీలు పార్టీలను వీడుతుండటం ప్రభావం ఎటువైపు ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. భారాసకు అన్నీ తానై ముందుకు సాగుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారాలతో పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు. పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు చేజారకుండా చూస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరావు, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితోపాటు ముఖ్యనేతలు చేరికలను పర్యవేక్షిస్తున్నారు. భాజపాలో అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతోపాటు ముఖ్యనేతలు పార్టీ ప్రచారం, చేరికలపై దృష్టిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని