logo

గోబెల్స్‌ ప్రచారం నమ్మొద్దు: హరీశ్‌రావు

భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు.

Published : 02 May 2024 06:35 IST

సిద్దిపేటలో ఓటు అభ్యర్థిస్తున్న హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డి

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. ఇప్పుడు భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సైతం గోబెల్స్‌ ప్రచారానికి సిద్ధమవుతున్నారన్నారు. ఇలాంటివి ప్రజలెవరూ నమ్మవద్దన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సిద్దిపేటలో కోమటి చెరువు కట్ట, నెక్లెస్‌రోడ్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయపు నడక చేస్తున్న వారిని భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలసి ఆత్మీయంగా పలకరించారు. భారాసకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం పలు వార్డుల్లో పాదయాత్రగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో భాజపా నాయకులు మరిన్ని ఫేక్‌ వీడియోలు తయారు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కొందరు నాయకులు ఆస్తులు కూడబెట్టు కోవడానికి రాజకీయాల్లోకి వస్తారని, వెంకట్రామిరెడ్డి మాత్రం తన ఆస్తులను ప్రజలకు పంచడానికి ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. బల్దియా మాజీ ఛైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు అరవింద్‌రెడ్డి, మోయిజ్‌, మల్లికార్జున్‌ తదితరులు ఉన్నారు.

సిద్దిపేట లఘుక్రీడా మైదానంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని హరీశ్‌రావు సందర్శించారు. క్రీడాకారులతో క్రికెట్‌ ఆడారు.

చిన్నకోడూరులో రోడ్‌షోకు హాజరైన ప్రజలు

ప్రజలను రెచ్చగొడుతున్న భాజపా, కాంగ్రెస్‌

నంగునూరు, న్యూస్‌టుడే: హిందూ, ముస్లింల మధ్య మతత్వాన్ని భాజపా రెచ్చగొడుతుంది, భాజపా గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని కాంగ్రెస్‌ పార్టీ కొత్త నాటకానికి తెరలేపిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం నంగునూరులో  రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కరవుతోపాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ ఎన్నికలు అధికారం, పదవుల కోసం కాదు తెలంగాణ భవిష్యత్తు కోసమని పేర్కొన్నారు.  సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాని కోరారు. దుబ్బాకను అభివృద్ధి చేయని రఘునందన్‌రావుకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని