logo

తొలి ఓటు వేశారోచ్‌

సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది.

Published : 03 May 2024 08:06 IST

ప్రశాంతంగా హోం ఓటింగ్‌

చేగుంట మండలం అనంతసాగర్‌లో ఓటేస్తున్న వృద్ధురాలు

దుబ్బాక, చేగుంట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌, గుమ్మడిదల, జిన్నారం: సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలో గురువారం ఈ ప్రక్రియ షురూ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఏడు మండలాలు, గుమ్మడిదల, ఐడీఏ బొల్లారం, మాసాయిపేట మండలాల్లో 85 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఆయా మండలాల నుంచి 194 మంది దరఖాస్తు చేసుకోగా.. తొలిరోజు 179 మంది ఓటేశారు. ఈ ప్రక్రియను 7 బృందాలు పర్యవేక్షించాయి. మెదక్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి గరిమ అగ్రవాల్‌, ఏఏఆర్వో వెంకటరెడ్డి, పుర కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ పరిశీలించారు. శుక్రవారం తొగుట, నార్సింగి మండలాల్లో ప్రక్రియ నిర్వహించనున్నారు.

గుమ్మడిదలలో సిరా చుక్క చూపుతున్న వృద్ధుడు


హలో బాగున్నారా..

హలో అక్కా, చెల్లి, బావ, అన్నయ్య, వదినమ్మ, తమ్ముడు అంతా క్షేమమేనా ఎలా ఉన్నారూ.. అంటూ ఇలా వరుసలు కలుపుతూ ఎన్నడూ లేని విధంగా నాయకులు ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఈ మే 13న ఎన్నికల సమీపిస్తుండడంతో ఆయా పార్టీల నాయకులు.. తమ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని ద్వితీయ శ్రేణి నేతలను ఇలా పలకరిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల వాయిస్‌ రికార్డ్‌ చేసి ఓటర్లకు ఫోన్‌ చేసి వినిపిస్తున్నారు.   

న్యూస్‌టుడే, మిరుదొడ్డి


పొరబడకుండా నిలబెట్టారిలా..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటుచేసిన ఈవీఎం నమూనా ఆకట్టుకుంటోంది. ఓటేయడానికి సంగారెడ్డి జిల్లా సిద్ధంగా ఉంది అని దీనిపై రాసి ఉంచారు. అందరూ తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని అంటూ స్ఫూర్తి నింపుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన వారంతా ఆసక్తిగా చూస్తున్నారు.          

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌


డిజిటల్‌ మార్గం.. ఓటరు చైతన్యం

ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్‌ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం డిజిటల్‌ ప్లాట్‌ఫారాలను సైతం వేదికగా చేసుకుంటోంది. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, డిజిటల్‌ వేదికలను ఉపయోగించుకుంటోంది. ఫోన్‌-పే, పేటీఎం వంటి డిజిటల్‌ నగదు బదిలీ యాప్‌లలో ‘లెట్స్‌ ఓట్‌ విత్‌ ప్రైడ్‌’ (రండి సగర్వంగా ఓటేద్దాం) అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సదరు యాప్‌లను తెరవగానే ఈ నినాదం కనిపిస్తోంది.  

న్యూస్‌టుడే, పాపన్నపేట


నర్సాపూర్‌కు దక్కని అవకాశం

1952 నుంచి ఇప్పటివరకు 18 లోక్‌సభ ఎన్నికలు జరగ్గా నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి ఒక్కరూ కూడా ఎంపీగా ఎన్నిక కాకపోవడం గమనార్హం. ఇక్కడి నుంచి ఎవరూ పార్లమెంట్‌లో అధ్యక్షా అనలేకపోయారు. తొలినాళ్లలో నర్సాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 2008 వరకు కొనసాగింది. పునర్విభజన అనంతరం మెదక్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. 2014 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే సునీతారెడ్డి పోటీ చేయగా.. విజయం సాధించలేకపోయారు. ఇంకొందరు వివిధ రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్రులుగా బరిలో నిలిచినా గెలుపొందలేకపోయారు.     

న్యూస్‌టుడే, నర్సాపూర్‌


జహీరా‘బాద్‌’షాకు మూడు భాషలు రావలె

తొలినాళ్లలో మెదక్‌ లోక్‌సభ పరిధిలో కొనసాగిన జహీరాబాద్‌ 2008లో లోక్‌సభ కేంద్రంగా రూపాంతరం చెందింది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌తో పాటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలతో దీన్ని ఏర్పాటుచేశారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ భాషల్లోనూ మాట్లాడుతుంటారు. ఈ మూడు భాషలు వస్తేనే నెగ్గుకురాగలరు. అప్పుడే ప్రజలు చెప్పే సమస్యలను అర్థం చేసుకోగలరు. కాంగ్రెస్‌ తరఫున మూడు సార్లు పోటీ చేసిన నారాయణఖేడ్‌కు చెందిన సురేష్‌కుమార్‌శెట్కార్‌ కన్నడ, తెలుగు, హిందీలో మాట్లాడగలరు. భాజపా నుంచి బరిలో నిలిచిన బీబీపాటిల్‌ కన్నడ, మరాఠీ, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. 

న్యూస్‌టుడే, జహీరాబాద్‌


ఏ పాట.. ఏ పార్టీదో..

ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పలు రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రచార రథాలను జోరుగా తిప్పుతున్నారు. ఇక పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎన్నికల సీజన్‌ కావడంతో అలా ఏదో పాట వినిపించగానే పలువురు వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అన్ని పార్టీల పాటలు ఒకేలా ఉంటున్నాయి. దీంతో ఏది ఏ పార్టీకి చెందినదో తేల్చుకోలేక తికమకపడాల్సి వస్తోంది. కాసేపు వింటే కాని అర్థమయ్యే పరిస్థితి. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సైతం పాటలు హోరెత్తుతున్నాయి.      

న్యూస్‌టుడే, పాపన్నపేట


ఎంపీగా.. అతివకు దక్కని అవకాశం

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఒక్కరూ కూడా మహిళా ఎంపీ ఎన్నిక కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం లోక్‌సభ పరిధిలో 8,32,080 మంది పురుషులు, 8,48,293 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. ఈ లెక్కన 16,213 మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ స్థానం నుంచి ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసిన మహిళ డీకే అరుణ మాత్రమే. 1995లో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈమె 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లికార్జున్‌ చేతిలో స్వల్ప మెజార్టీ 3,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్‌ నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేసి భాజపా నుంచి బరిలో దిగారు. భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి చేతిలో 77,829 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం భాజపా నుంచి మూడో సారి బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి మరో ముగ్గురు సరోజనమ్మ, గోవిందమ్మ, విజయలు సైతం పోటీలో ఉన్నారు.

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని