logo

వలస ఓటరు కలిసొచ్చేనా ..

ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 08 May 2024 06:02 IST

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సొంత గ్రామాలకు వస్తూ..

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌, కొడంగల్‌: ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ ప్రాంతాల్లో వలసలు అధికంగా ఉంటాయి. ఆయా చోట్ల ఉపాధి సరిగా దొరక్క హైదరాబాద్‌తో పాటు ముంబయి, బెంగళూరు వంటి పట్టణాలకు వలస వెళ్లి వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇలా వెళ్లిన వారిని పోలింగ్‌ రోజు వరకు రప్పించేందుకు పార్టీల నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 3 లక్షల జనాభా ఉంటుంది. వీరిలో సుమారు లక్ష మంది వరకు హైదరాబాదు, బీదర్‌ తదితర ప్రాంతాలకు కుటుంబాలతో సహా వలస వెళ్లారు. కొడంగల్‌ నియోజకవర్గంలో 2,41,960 మంది ఓటర్లు ఉండగా.. 60 వేల మందికి పైగా ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. పుణె, ముంబయి ప్రాంతాలకు వెళ్లి బతుకీడుస్తున్నారు. వీరంతా ప్రధాన పండగలు, పలు కార్యక్రమాలకు సొంతూళ్లకు వచ్చివెళ్తున్నారు. ఇళ్లు, వ్యవసాయ భూములు ఉండటంతో గ్రామాల్లో రేషన్‌ కార్డులు కలిగి ఉన్నారు. ఓటరు జాబితాలో సైతం వీరి పేర్లు నమోదై ఉన్నాయి.

ప్రణాళిక సిద్ధం:   ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఏయే గ్రామాల్లో వలసదారులు ఎంతమంది ఉన్నారన్నది వివరాలు సేకరించారు. వారిని రప్పించే బాధ్యతను ఆయా గ్రామాలు ఉండే మండలాల నాయకులకు అప్పగించారు. ప్రత్యేకంగా వాహనాల ఏర్పాటు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించడం తప్పనిసరి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు నెలల ముందు నుంచే ఈ కసరత్తు చేపట్టారు. దీంతో ఎవరెక్కడ ఉన్నారనే విషయమై స్థానిక నాయకులకు పూర్తి అవగాహన ఉంది. ఓ ప్రాంతంలో ఉండేవారి సంఖ్యను బట్టి వారికి జీపు, వ్యాను, లారీ, టూరిస్టు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది సొంతంగా వచ్చి ఓట్లేసి వెళ్లే అవకాశం లేకపోలేదు.

 తప్పని ఖర్చు..

 ఈ రెండు నియోజకవర్గాల్లోని నాయకులు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతూ అక్కడే నివాసం ఉంటున్నా ఓట్లు స్వగ్రామాల్లోనే ఉన్నాయి. వారిని తీసుకొచ్చేందుకు అభ్యర్థులకు ఖర్చు తప్పదు. ఇందుకు రూ.లక్షల్లో వెచ్చించాల్సిందేనని పలువురు నేతలు చెబుతున్నారు. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఉపాధికి వచ్చిన వారూ ఉన్నారు. వీరితో అక్కడి నాయకులు సంప్రదించి తీసుకెళ్లేందుకు బస్సులు, తదితర వాహనాలను పంపిస్తుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు