logo

తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు

తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 10 May 2024 06:15 IST

అంతర్‌జిల్లా దొంగ పట్టివేత  

కుకునూరుపల్లి(కొండపాక గ్రామీణం), తొగుట, న్యూస్‌టుడే: తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అదనపు డీసీపీ ఎస్‌.మల్లారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. తన ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారని కుకునూరుపల్లి ఠాణా పరిధి కొడకండ్ల నివాసి బి.నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన షేక్‌ సలీమ్‌(53)ను నిందితుడిగా గుర్తించారు. అప్పటి నుంచి అతని కోసం గాలిస్తుండగా, ఈ నెల 8వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో కుకునూరుపల్లిలో బస్సు దిగాడు. పోలీసులు అతన్ని పట్టుకొనేందుకు యత్నించగా పారిపోబోయాడు. అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. సలీం గత పలు గ్రామాలు తిరుగుతూ కట్‌పీసులు అమ్ముతున్నాడు. కుటుంబ పోషణకు, జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు ఎంచుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ చేసి రాత్రుళ్లు చోరీలు చేస్తున్నాడు. 2023 జనవరి 17వ తేదీన కొడకొండ్లలో పాత ఇనుప సామగ్రి అమ్మేవారి వద్ద ఓ కడ్డీ కొనుగోలు చేశాడు. ఓ ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 4 తులాల బంగారు పుస్తెలతాడు, రూ.10 వేల నగదు అపహరించాడు. సిద్దిపేట పట్టణంలో 3, సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి, నారాయణరావుపేట, చేర్యాలలో ఒక్కో చోరీ చొప్పున చేశాడు. నేరం అంగీకరించిన సలీంను పోలీసులు అరెస్టు చేసి జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తొగుట సీఐ లతీఫ్‌, కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌, క్రైమ్‌ సిబ్బందిలను అదనపు డీసీపీ అభినందించారు.


లోకం చూడకుండానే..

గుమ్మడిదల: నవజాత శిశువు మృతదేహం గురువారం మండల పరిధిలో లభ్యమైంది. ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని దోమడుగు పరిధి నల్లపోచమ్మ ఆలయ సమీపంలో ప్లాస్టిక్‌ కవర్‌లో నవజాత మగ శిశువు మృతదేహాన్ని గమనించి చుట్టుపక్కల వారు పంచాయతీ సిబ్బందికి తెలిపారు. విషయం తెలుసుకొన్న దోమడుగు అంగన్‌వాడీ టీచరు వరలక్ష్మి, పర్యవేక్షకురాలు కవిత వచ్చి చూశారు. గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు మధుకర్‌కు తెలపడంతో ఆయన అక్కడికి వచ్చి శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. పుట్టగానే పడేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

రామాయంపేట, న్యూస్‌టుడే: గుర్తుతెలియని ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కామారెడ్డి వైపు నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు దాటే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని ఎస్సై రంజిత్‌ తెలిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


పోక్సో కేసులో జీవితఖైదు

రామాయంపేట, న్యూస్‌టుడే: పోక్సో కేసులో ఓ వ్యక్తికి జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తీర్పు ఇచ్చినట్లు గురువారం జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలికపై అత్యాచారం చేసిన నిజాంపేట మండల పరిధి నార్లాపూర్‌ గ్రామానికి చెందిన మన్నె నర్సింలుపై 2021 అక్టోబరు 5న పోక్సో కేసు నమోదైంది. నిందితుని కోర్టులో హాజరుపరచగా కేసు వివరాలు పరిశీలించిన జడ్జి, నిందితుడు నర్సింలుకు జీవితఖైదుతో పాటు రూ.1.50లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్సీ తెలిపారు.


ఎన్నికల శిక్షణకు హాజరు కాని 15 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల శిక్షణకు హాజరు కాని 15 మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి తాఖీదులు జారీ చేసినా సరైన వివరణ ఇవ్వనందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సస్పెండైన వారిలో ఐదుగురు పీవోలు, ఏపీవోలు, పది మంది ఓపీఓలు ఉన్నారు. దశరథ్‌(లోనికలాన్‌, మునిపల్లి), మల్లేశ్వరి(మల్కాపూర్‌, కొండాపూర్‌), యేసుపాదం(పటాన్‌చెరు), విజయ్‌కుమార్‌(నల్తూరు, జిన్నారం), సావిత్రి(వైఎస్‌ఆర్‌ కాలనీ, బొల్లారం), సవిత (ఎన్కెముర్రి, కంగ్టి), శ్యామల(లస్కరితండా, నాగల్‌గిద్ద), రాధాదేవి( చింతల్‌చెరు, హత్నూర), స్వప్న (బిలాల్‌పూర్‌, కోహీర్‌), రామకృష్ణాచారి (వెలిమల, రామచంద్రాపురం), పాండు (కసబ్‌గల్లి, జహీరాబాద్‌), శ్రీనివాస్‌(కొడిపాక, హత్నూర), లాల్‌సింగ్‌ నాయక్‌ (పీపడ్‌పల్లి, రాయికోడ్‌), శ్రీశైలం(రంజోల్‌, జహీరాబాద్‌), విజయ్‌భాస్కర్‌ (బస్వాపూర్‌, ప్కుల్కల్‌)లు సస్పెండైన వారిలో ఉన్నట్లు డీఈవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు