logo

12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్‌

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

Published : 10 May 2024 01:20 IST

మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. గురువారం రాత్రి హుస్నాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద జరిగిన కార్నర్‌ సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి గుండు అరగుండు అంటు తనను తిట్టుడు మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలు మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. తాను నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశానని మంత్రి, భారాస మాజీ ఎంపీ అంటున్నారన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గానికి ఐదేళ్లలో రూ.12వేల కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు. జాతీయ రహదారుల పనులు ప్రారంభించామని చెప్పారు.  ఐదేళ్లలో తనపై 109 కేసులు పెట్టారని, రెండుసార్లు జైలుకు వెళ్లానన్నారు. ఇక్కడి మంత్రికి రాజకీయ గురువు చొక్కారావని ఆయన ఓటమికి కారకుడైన నేత కుమారుడికి ఎంపీ టికెట్‌ ఇప్పించారన్నారు. ఎమ్మెస్సార్‌, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్‌ను ఓడగొట్టిన వారికి టికెట్‌ ఇచ్చారన్నారు. భారాస అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ స్థానికుడు కాదన్నారు. పక్క జిల్లాకు చెందిన వాడు కాబట్టి ఇక్కడి రహదారులు, ఇతర అభివృద్ధిగురించి, గౌరవెల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. తాను పక్కా లోకల్‌ కనుక ప్రజల వెంట ఉంటానన్నారు. హుస్నాబాద్‌ కేంద్రంగా తన వీడియోలు మార్ఫింగ్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.


పదేళ్లపాటు దేశం సుభిక్షం

దుబ్బాక, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా ప్రభుత్వ పాలనతో పదేళ్లపాటు దేశం సుభిక్షంగా ఉందని మెదక్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. నేడు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌, భారాసలు ఒకటేనని చెప్పారు. గురువారం మండలంలోని హబ్షీపూర్‌ నుంచి దుబ్బాక వరకు భాజపా శ్రేణులతో నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీ, అనంతరం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని, పట్టణంలోని స్థానిక బస్టాండ్‌ వద్ద మాట్లాడారు. దుబ్బాకలో చెల్లని నాణెం మెదక్‌లో ఎలా చెల్లుతుందని కేసీఆర్‌ అన్న వ్యాఖ్యలకు కామారెడ్డిలో చెల్లని కేసీఆర్‌ అనే రూపాయి రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు.గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన  కంపెనీ డబ్బును పోలీస్‌ వాహనాల్లోనే తరలించి, విచ్చలవిడిగా పంపిణీ చేసినట్లు అంగీకరించిన రాధాకిషన్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు, నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడంతోనే భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటును అమ్ముకొని భవిష్యత్తు పాడుచేసుకోవద్దని ఓటర్లకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు