logo

మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు

కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.

Published : 10 May 2024 01:22 IST

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

అభివాదం చేస్తున్న చాడ వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీపీఐ కార్యదర్శులు, నాయకులు

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్‌లోని ఒక వేడుక మందిరంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రావును గెలుపు కాంక్షిస్తూ సీపీఐ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో తామే పోటీ  చేస్తున్నట్లుగా భావించి ఇంటింటికీ కార్యకర్తలు వెళ్లి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలన్నారు. మతోన్మాదాన్ని మోదీ రెచ్చగొట్టారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మన నాయకుడు అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్ధల ఎన్నికలు రానున్నాయని, అపుడు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేస్తామన్నారు. భారాస నష్టం చేసిందని, ధరణి, భూముల దగ్గర ఇబ్బందులకు గురి చేసిందని.. ఆ పార్టీని ఓడించాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలని భాజపా చూస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమావేశంలో మాట్లాడుతూ ఆరోపించారు. పైకి శ్రీరాం అంటూ.. లోలోపల రిజర్వేషన్లకు రాంరాం అంటున్నారన్నారు.తాను శాసనసభ్యుడుగా గెలవడానికి సీపీఐ సహకరించిందని ధన్యవాదాలు తెలిపారు. తనను అడిగినా పనులు చేయడం లేదని కొందరు రాజకీయంగా బద్నాం చేయడానికి చూస్తున్నారన్నారు. సిద్దిపేట, కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్‌,  మర్రి వెంకటస్వామి, కర్రె బిక్షపతి, సభ్యులు గడిపె మల్లేశ్‌, కోయడ సృజన్‌కుమార్‌, గూడెపు లక్ష్మి, బోయిన భాస్కర్‌, జాగిరి సత్యనారాయణ, చాడ శ్రీధర్‌రెడ్డి, శంకర్‌ పాల్గొని మాట్లాడారు.

హామీలు అమలు చేస్తున్నాం: మంత్రి

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో కస్తూర్బా కాలనీ, చేనేత కాలనీ, గణేశ్‌నగర్‌, బస్‌డిపో వెనుక కాలనీ, ఆరెపల్లె, పోచమ్మవాడ, జ్యోతినగర్‌తోపాటు వివిధ వార్డులలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాల్లో, పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యాక రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 అందచేస్తామన్నారు. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారన్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో వానతో వరద వల్ల ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు తెలుపగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ రహదారి నిర్మాణంలో ఎక్కువ నష్టం జరగకుండా చూడాలని వ్యాపారులు కోరారు. చేనేత కాలనీలో మంత్రి మగ్గం నేస్తూ కార్మికులతో మాట్లాడారు. హమాలీ కార్మికులతో మాట్లాడి సమస్యలు తెల్సుకున్నారు.
బెజ్జంకి: బెజ్జంకిలో వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా చాడ వెంకటరెడ్డి, సీపీఐ నేతలు కరపత్రాలు పంచుతూప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు