logo

నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్‌

‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌. దేశంలో కాంగ్రెస్‌, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు.

Updated : 10 May 2024 06:13 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డిలో మాట్లాడుతున్న హరీశ్‌రావు, పక్కన వెంకట్రామిరెడ్డి, చింతా ప్రభాకర్‌, నాయకులు

సంగారెడ్డి టౌన్‌, జహీరాబాద్‌, న్యూస్‌టుడే: ‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌. దేశంలో కాంగ్రెస్‌, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం లాంటివి ఎవరైనా కట్టించారా.. కేసీఆర్‌ గుండెల్లో భక్తి ఉంది. ఆయన నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు. భాజపా వాళ్లకు ఓట్ల కోసమే దేవుడు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం జహీరాబాద్‌లో భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌, సంగారెడ్డిలో మెదక్‌ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షోల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భాజపా విధానాలను కేసీఆర్‌ వ్యతిరేకించినందుకే కవితను అరెస్టు చేయించారని ఆరోపించారు. విద్యుత్తు కోతలు పెడుతున్న కాంగ్రెస్‌కు ఓట్లలో కోతలు పెట్టాలని పిలుపునిచ్చారు. ఉదయ్‌పూర్‌ డ్లికరేషన్‌ ఏమైందని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు.  ఆడ పిల్ల వివాహానికి రూ.లక్ష, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కల్యాణలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రాసిచ్చిన బాండు పేపరు బౌన్స్‌ అయిందని, ప్రజలకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌లో కర్ఫ్యూలు, మతకల్లోలాలు లేవని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, భారాస అభ్యర్థులు గాలి అనిల్‌కుమార్‌, వెంకట్రామిరెడ్డి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎం.శివకుమార్‌, దేవీప్రసాద్‌ పాల్గొన్నారు.


కష్టపడండి.. భవిష్యత్తు మీదే

కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు జగ్గారెడ్డి సూచన

మల్కాపూర్‌లో ప్రసంగిస్తున్న జగ్గారెడ్డి

కొండాపూర్‌, స్యూస్‌టుడే: సంగారెడ్డి నియోజకవర్గంలో భారాస అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు 15వేలకు పైగా మెజారిటీ వచ్చేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. గురువారం కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ శివారులోని ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ ప్రచార పత్రాలు సరిగా పంపిణీ చేయలేదని కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం తక్కువగా ఉంది.. నిర్లక్ష్యం చేయవద్దన్నారు. తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే వారు అవసరమైతే సొంత డబ్బులు ఖర్చు చేసైనా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకే పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సమావేశంలో కొండాపూర్‌ ఎంపీపీ మనోజ్‌రెడ్డి, నాయకులు తోపాజీ అనంతకిషన్‌, వై.ప్రభు, నర్సింహారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆంజనేయులు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అన్నివర్గాల సంక్షేమానికి కృషి

మాట్లాడుతున్న బీబీ పాటిల్‌

జహీరాబాద్‌, టేక్మాల్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నాయని జహీరాబాద్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌ అన్నారు. గురువారం జహీరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక పనులు చేశానన్నారు. భాజపాకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.జైపాల్‌రెడ్డి, సీడీసీ మాజీ ఛైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, నియోజకవర్గ కన్వీనర్‌ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టేక్మాల్‌ మండల పరిధిలోని పల్వంచ శివారులో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొని ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు