logo

వేగులు.. నేతలకు గుబులు

లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Published : 10 May 2024 01:27 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహించనున్నారు. వచ్చే నెల 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో ప్రత్యర్థుల ఎత్తులు చిత్తులు చేసేందుకు రాజకీయ పార్టీలు వేగులపై ఆధార పడుతున్నారు. అభ్యర్థుల అవసరం వీరికి కలిసివస్తోంది. వేగులు అందించిన సమాచారం ఆధారంగా అభ్యర్థులు ఎప్పటికప్పుడు వీరికి ఎంతో కొంత అదజేస్తున్నారు. దీంతో వేగుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం.

నిర్ధారించుకునే లోపే..: వేగులు ఇచ్చిన సమాచారం వాస్తవమా.. కాదా.. అని నిర్థారించుకుని అభ్యర్థులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి సమయం మించిపోతోంది. దీంతో అప్పటికే పార్టీకి నష్టం జరిగిపోతోంది. కొన్నిసార్లు వేగులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం అన్న చందంగా మారుతోంది. అభ్యర్థులకిది ఇబ్బందిగా మారింది. వేగుల సమాచారం ఒక్కోసారి నేతలను అప్రమత్తత చేస్తుండగా.. అప్పుడప్పుడు అనర్థాలకు కారణమవుతోంది.

చెదిరిపోతున్న వ్యూహాలు

ఎన్నికల సమయం సమీపించగానే వేగులను రాజకీయ పార్టీలే రంగంలోకి దించుతున్నాయి. తమకు అత్యంత నమ్మకంగా ఉండే వారికి అవతలి పార్టీ కండువా కప్పుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ పార్టీలో చేరగానే అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం వేగుల పని. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వేల సంఖ్యలో చేరికలు ఉంటున్నాయి. వీరిలో ఒక్కో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో వేగులు ఉంటున్నారు. దీంతో తాము ఎంతో కష్టపడి పన్నిన వ్యూహాలు అవతలి పార్టీకి ముందే తెలిసిపోతుండటం అభ్యర్థులకు సమస్యగా మారింది. ఈ పరిణామాలతో పార్టీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేక నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

రాత్రికి సొంత గూటికి

జిల్లాలో మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌ స్థానం పరిధిలో అందోలు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రధాన పార్టీల్లో వేగులు(కోవర్టులు) ఉన్నారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అవతలి పార్టీ అభ్యర్థుల వెంటే ఉంటున్నారు. రాత్రి కాగానే సొంత (పార్టీ)గూటికి చేరుతున్నారు. వీరికి బిర్యానీ, మద్యంతోపాటు తాయిలాలకు కొరత ఉండటం లేదు. ఉదయం నుంచి అవతలి పార్టీ కదలికలపై ఎప్పటికప్పుడు చేరవేసినా రాత్రి సమయంలో వేగులు ఇచ్చే సమాచారమే అభ్యర్థులకు కీలకంగా మారుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు