logo

భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం

చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్‌ యాదవ సంఘం సభ్యులు మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Published : 10 May 2024 01:31 IST

గొంగడి కప్పి హరీశ్‌రావును సన్మానిస్తున్న గొల్లకుర్మలు

చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్‌: చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్‌ యాదవ సంఘం సభ్యులు మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. మాజీ సర్పంచి నవీన్‌, భారాస నాయకులు సాగర్‌రెడ్డి, ఎల్లయ్య, తదితరులున్నారు. ్య సిద్దిపేట గ్రామీణ మండలం తోర్నాలలో జరుగుతున్న బీరప్ప ఆలయ ఉత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీశ్‌రావును గొంగడితో గొల్లకుర్మలు సన్మానించారు. ్య  గత పదేళ్లలో కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఎన్నారై సెల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం అన్నారు. సిద్దిపేటలో మాట్లాడుతూ..  ఈ పథకాలను ప్రతిపక్ష పార్టీలో ప్రజల్లోకి వ్యతిరేక ధోరణితో తీసుకెళ్లటంతో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.


‘పదేళ్లపాటు దేశం సుభిక్షం’

దుబ్బాక రోడ్డుషోలో రఘునందన్‌రావు

దుబ్బాక, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా ప్రభుత్వ పాలనతో పదేళ్లపాటు దేశం సుభిక్షంగా ఉందని మెదక్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. నేడు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌, భారాసలు ఒకటేనని చెప్పారు. గురువారం మండలంలోని హబ్షీపూర్‌ నుంచి దుబ్బాక వరకు భాజపా శ్రేణులతో నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీ, అనంతరం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని, పట్టణంలోని స్థానిక బస్టాండ్‌ వద్ద మాట్లాడారు. దుబ్బాకలో చెల్లని నాణెం మెదక్‌లో ఎలా చెల్లుతుందని కేసీఆర్‌ అన్న వ్యాఖ్యలకు కామారెడ్డిలో చెల్లని కేసీఆర్‌ అనే రూపాయి తెలంగాణ రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని, ధర్మపురిలో ఓడిన కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లిలో, నిజామాబాద్‌లో ఓడిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు నిజామాబాద్‌ ఎంపీగా భారాస తరపున ఎలా అవకాశం ఇచ్చారో కేసీఆర్‌ ప్రశ్నించుకోవాలన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన  కంపెనీ డబ్బును పోలీస్‌ వాహనాల్లోనే తరలించి, విచ్చలవిడిగా పంపిణీ చేసినట్లు అంగీకరించిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు, నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడంతోనే భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటును అమ్ముకొని భవిష్యత్తు పాడుచేసుకోవద్దని ఓటర్లకు సూచించారు.


ఎన్డీయే పథకాలతో ప్రజలకు మేలు: భాజపా

సమావేశంలో మాట్లాడుతున్న బీబీ పాటిల్‌, తదితరులు

టేక్మాల్‌, న్యూస్‌టుడే: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయని జహీరాబాద్‌ భాజపా అభ్యర్థి బీబీపాటిల్‌ అన్నారు. మండల పరిధిలోని పల్వంచ శివారులో గురువారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను విస్తరించిందన్నారు. భాజపా అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని.. రాజ్యాంగాన్ని మారుస్తారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. భారాస ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కాంగ్రెస్‌ ప్రస్తుతం గద్దెనెక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, మాజీ మంత్రి ఆంజనేయులు, నాయకులు రవిగౌడ్‌, జగదీశ్వర్‌, శివశంకర్‌, సిద్దేశ్వర్‌, మండల అధ్యక్షుడు నవీన్‌గుప్తా తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు