logo

ఓటెందుకు వేయాలంటే..

ఎంత ఎక్కువ పోలింగ్‌ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్‌ నమోదవుతున్నా..

Updated : 10 May 2024 06:12 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌, వికారాబాద్‌

ఎంత ఎక్కువ పోలింగ్‌ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్‌ నమోదవుతున్నా.. లోక్‌సభ పోరుకు వచ్చేప్పటికీ 10-20 శాతం పడిపోతోంది. రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహించకపోవడం, ఓటు ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించకపోవడం తదితర కారణాలు ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. అన్ని రాష్ట్రాలను సమన్వయం చేస్తూ దేశాభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తుంది. సమగ్ర పాలనకు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు అందరూ ఓటేయాలి.. ఏ కారణాలతో ఇవి ముఖ్యమైనవని చాటేదే ఈ కథనం. ప్రతి ఓటరు ఈ నెల 13న పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లాలి. మెరుగైన తీర్పు ఇవ్వాలి.

ఇందుకు 1

అన్నదాతలకు చేయూత: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు చేయూత దక్కాలంటే వారి కష్టాలు తెలిసిన అభ్యర్థిని పార్లమెంట్‌కు పంపాలి. పంటలకు మద్దతు, ఎరువుల ధరలను కేంద్రమే నిర్ణయిస్తుంది. సూక్ష్మసేధ్యం పరికరాల అయ్యే ఖర్చులో అధిక మొత్తం రాయితీ కింద కేంద్రమే భరిస్తుంది.

ఇందుకు 2

పరిశోధÅనలకు ఊతం: దేశ ప్రగతిలో పరిశోధనలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇందుకు కేంద్రమే నిధులు కేటాయిస్తుంది. భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రుడి దక్షిణధ్రువంపై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. మామిడి, ఇతర వాటిపై పరిశోధించేందుకు సంగారెడ్డిలో ఫల పరిశోధనా స్థానాన్ని అందుబాటులోకి తెచ్చారు.

3

కీలకం.. దేశ రక్షణ: దేశానికి రక్షణ రంగం ఎంతో కీలకం. కేంద్రమే త్రివిధ దళాలను నియమించుకోవడం, ఆయుధ సంపత్తి సమకూర్చుకోవడం తదితర కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. సమర్థ పాలకులను ఎన్నుకుంటే శత్రు దేశాలు మనపై కన్నెత్తి చూసేందుకు భయపడతాయి. ఇందుకు మనం తప్పనిసరిగా ఓటేయాలి. ఆయుధాల ఉత్పత్తికి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఆయుధ కర్మాగారాన్ని నెలకొల్పడం గమనార్హం.

4

రహదారులతో రాచబాటలు.. : పెరుగుతున్న జనాభా, అవసరాలు, సత్వర సేవలకు అనుగుణంగా జాతీయ రహదారులు వివిధ దశల్లో విస్తరించాలి. ఎళ్లలు చెరిపివేస్తూ సుదూర ప్రాంతాలకు సులువుగా సాగాలంటే ఇవే కీలకం. ప్రజల అభీష్టం మేర కేంద్రం జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటుంది. ఇందుకు దండిగా నిధులు కేటాయించే బాధ్యత వారిదే.

కూ.. చుక్‌.. చుక్‌..

రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైనది రైల్వే. సుదూర ప్రాంతాలకు సులువుగా తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించవచ్చు. నాలుగు జిల్లాల్లో ఈ సేవలు అందుతున్నాయి. రైల్వే లైన్ల మంజూరు, నిర్వహణ బాధ్యతలను కేంద్రమే చూస్తుంది. సేవల విస్తృతి, వసతుల కల్పకు తగిన నేతను ఎన్నుకోవాలి. ఆలోచించి తప్పక ఓటేయాల్సిన బాధ్యత ఆయా జిల్లాల ప్రజలదే.

6 ఆహ్లాదానికి చిరునామా.. పర్యాటకం నజరానా

రంగనాయక్‌సాగర్‌

నిత్య జీవితంలో కాస్త ఆహ్లాదం పొందాలంటే పర్యాటక రంగ అభివృద్ధి అవశ్యం. చారిత్రక నేపథ్యం కలిగిన కట్టడాల సంరక్షణ ప్రతి ఒక్కరి విధి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చారిత్రక కట్టడాల పరిరక్షణ, ఇతరత్రా రూపాల్లో పర్యాటానికి నిధులు కేటాయిస్తుంది. ఈ తరుణంలో పర్యాటక పురోగతికి ఎంపీ నిధులు అవసరం. ఎన్నికయ్యే నేత ప్రత్యేక చొరవ చూపి చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాల అభివృద్ధికి ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలి.

7

వంటకు తంటా లేకుండా..: వంటగ్యాస్‌ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వంటకు గ్యాస్‌ తప్పనిసరిగా మారింది. నాలుగు జిల్లాల్లో లబ్ధిదారులు భారీగా ఉన్నారు. గృహిణులు నిత్యం వంట చేసేందుకు తొలి ప్రాధాన్యం గ్యాస్‌కే ఇస్తున్నారు. ఈ గ్యాస్‌ ధరలను కేంద్రమే నిర్ణయిస్తుంది.

8

చోదక శక్తి..: అన్ని వర్గాలకు వాహన వినియోగం అనివార్యమైంది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో మెజార్టీ ప్రజలు ద్విచక్ర వాహనాలు, కార్లు వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ముడిపడిన అంశం ఇది. ఇవి నడవాలంటే పెట్రో ఉత్పత్తులు తప్పనిసరి. చమురు సంస్థలతో సమన్వయంగా ముందుకు సాగే కేంద్రం.. ధరలను నిర్దేశిస్తుంది.

9

అనివార్యం సుమా..: రోజు గడవాలంటే నిత్యావసర వస్తువులు అవశ్యం. ఏవర్గమైనా వీటిని తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందే. దేనికి ఎంత పన్ను విధించాలి.. మినహాయింపు ఇవ్వాల్సినవి ఏమిటనేది దిల్లీ నుంచి పాలించే నేతల చేతుల్లో ఉంటోంది. ఇందుకు మనం గల్లీ నుంచి పారదర్శకమైన నేతకు జై కొట్టాలి. తద్వారా ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టినట్లవుతుంది.

10

సత్సంబంధాలూ ప్రధానం: ఇతర దేశాలతో సత్సంబంధాలు కూడా ముఖ్యమే. విదేశాలతో సఖ్యతగా ఉంటే దేశాభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేంద్రంలోని విదేశీ వ్యవహారాల శాఖ ఈ బాధ్యతలను చూస్తుంది. దేశ ప్రతిష్ఠను పెంచేందుకు ఈ శాఖ చర్యలు తీసుకుంటుంది. విదేశీ పెట్టుబడులు సైతం వచ్చేలా చేసేది కేంద్రమే. ఇతర దేశాలతో సఖ్యతగా ఉంటేనే పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. మన ప్రాంతంలోనూ పరిశ్రమలు వెలుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు