logo

343 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

Published : 10 May 2024 01:41 IST

ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు

శివ్వంపేట మండలం కొత్తపేటలో..

న్యూస్‌టుడే-మెదక్‌: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాలతో పాటు సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ రోజున ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీస్‌, ఇటు ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో నిఘా పెట్టనున్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, కేంద్ర బలగాల బందోబస్తు, సూక్ష్మ పరిశీలకుడి సమక్షంలో పర్యవేక్షణ చేయనున్నారు.

గజ్వేల్‌ సెగ్మెంట్‌లో అత్యధికం

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,124 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గత అసెంబ్లీ లేదా ఇదివరకు ఎన్నికలు జరిగిన పోలింగ్‌ కేంద్రాల్లో గొడవలు, అల్లర్లను దృష్టిలో ఉంచుకొని వాటిని అధికారులు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వాటిపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్‌ పరిధిలో 343 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇందులో గజ్వేల్‌ సెగ్మెంట్‌లో అత్యధికంగా 69 ఉన్నాయి. ఆ తర్వాత నర్సాపూర్‌లో 54.. అతి తక్కువగా సిద్దిపేట సెగ్మెంట్‌లో ఉన్నాయి. సమస్యాత్మక కేంద్రాల పరిధిలో పాత నేరస్థులను బైండోవర్‌ చేయడంతో పాటు వారి కదలికలపై ప్రత్యేక నిఘాపెట్టారు.

నిశిత పరిశీలన... సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందిని నియమించనున్నారు. ఇక్కడ కేంద్రం లోపల ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. ఇక సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు పోలింగ్‌ రోజున ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా సూక్ష్మ పరిశీలకుడిని నియమించనున్నారు. ఆయనతో పాటు కేంద్రం లోపల, బయట రెండు సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణ చేపట్టనున్నారు. ఇక శాంతిభద్రతలపరంగా 144 సెక్షన్‌ విధించనున్నారు. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే... అక్కడికి త్వరగా చేరుకునేందుకు ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ప్రజల్లో ధైర్యం నింపేందుకు పట్టణాలు, మండల కేంద్రాల్లో బలగాలు కవాతు నిర్వహించాయి. పోలింగ్‌ రోజున ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే దానిపై ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్‌ సిబ్బందికి సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు