logo

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం

ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి.

Published : 18 May 2024 01:23 IST

365బీ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం

చేర్యాల పట్టణం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలో గుంతలో పడబోయిన కారు

న్యూస్‌టుడే, చేర్యాల: ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మీదుగా దుద్దెడ క్రాస్‌రోడ్డు నుంచి జనగామ జిల్లా కేంద్రం వరకు సాగుతున్న 365బీ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇలాగే సాగుతున్నాయి. రూ.300 కోట్లతో చేపట్టిన ఈ పనులపై నిర్లక్ష్యం వహించడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం ముందస్తు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదు. కొన్నిచోట్ల అసంపూర్తి పనులను అలాగే వదిలేశారు. పూర్తయిన చోట చక్కగా ఉందనుకుంటే వేగంగా వెళ్తే.. ప్రమాదంలో కాలేసినట్లే. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు.

నిబంధనలు పాటించక..: పనులు జరిగే చోట హెచ్చరిక, రహదారి మళ్లింపు సూచికలు, అవసరం ఉన్న చోట ఇసుక బస్తాలు అడ్డుగా ఉంచాలి. కల్వర్టు నిర్మాణానికి సుమారు పది అడుగుల గుంతలు తీసిన ప్రాంతంలోనూ హెచ్చరికలు కరవయ్యాయి. ఆయా చోట్ల పలువురు పడిపోయి గాయపడ్డారు. కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన పి.రాజు కారు ఫిబ్రవరి 10న చేర్యాలకు వస్తూ పట్టణంలో ప్రయాణప్రాంగణం సమీపంలో తీసిన గుంతలో పడిపోయింది. రాజు గాయాలతో బయటపడ్డారు. ఇటీవల రాత్రి వేళ రహదారిపై విభాగిని ఉన్నట్లు సూచికలు లేకపోవడంతో ఓ లారీ పైకి ఎక్కేసింది.

యమ‘కంకరలు’: చేర్యాల మండలం దొమ్మాట గ్రామానికి చెందిన చల్లా లక్ష్మి.. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సామగ్రి కోసం అదే గ్రామానికి చెందిన బంధువుతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. కంకర కుప్పలను చదును చేస్తున్న డోజర్‌ వెనక్కి వెళ్తూ.. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని డీకొట్టింది. లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నెల 13న రాత్రి లెనిన్‌నగర్‌ శివారులో అమ్మ మందుల కోసం వెళ్లి మహ్మద్‌ యాకుబ్‌.. కల్వర్టు గోడకు వాహనంతో ఢీకొట్టగా దుర్మరణం పాలయ్యాడు. చేర్యాల మండలం దానంపల్లికి చెందిన రామ్మూర్తి.. చేర్యాల శివారు గుర్జకుంట వాగు సమీపంలో రోడ్డుపై పడిపోయి గాయపడ్డాడు. రహదారి విస్తరణలో రోడ్డు సగభాగం పాత బీటీని తొలగించడంతో వాహనం అదుపుతప్పింది.

తగు చర్యలు తీసుకుంటాం..: కిరణ్, డీఈ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ

కొన్ని చోట్ల హెచ్చరిక సూచికలు ఏర్పాటుచేశాం. ఇక నుంచి పనులు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. రహదారి విస్తరణ జరుగుతున్న చోట వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పనులు జరిగేలా చొరవ చూపుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని