logo
Published : 03/12/2021 03:13 IST

సైబర్‌ నేరం.. అప్రమత్తతే ఆయుధం

ఆన్‌లైన మోసాలపై పాఠశాల స్థాయిలో అవగాహన

నాంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

నాంపల్లి, నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నానాటికీ పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవాళి మనుగడను అదే స్థాయిలో శాసిస్తోంది. పరిజ్ఞానం వల్ల కలిగే లాభాలతో పాటు ఆన్‌లైన్‌ మోసాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లు వినియోగిస్తుండటం, కంప్యూటర్లు వాడుతుండటంతో సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యాప్‌ల వినియోగం, మోసాల గుర్తింపు, తదితర అంశాలపై పాఠశాల దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా సమాజాన్ని అప్రమత్తం చేసేలా తెలంగాణ పోలీసు శాఖ, షీ టీమ్స్‌, విద్యాశాఖ సంయుక్తంగా సంకల్పించి, సైబర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని రూపొందించాయి.

జిల్లాలో 52 బడుల్లో 104 మంది ఎంపిక
నల్గొండ జిల్లా వ్యాప్తంగా 52 ఉన్నత పాఠశాలలను గుర్తించారు. ఆయా పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడిని మెంటర్‌గా, ఇద్దరు విద్యార్థులను సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 104 మంది ని గుర్తించి ఇప్పటికే మూడు విడతల్లో శిక్షణ పూర్తిచేశారు. ఏడు విడతల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి సైబర్‌ మోసాలపై ఆన్‌లైన్‌లో అవగాహన కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, సామాజిక మాధ్యమాల ద్వారా అనుచిత ధోరణులకు ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి నెలా హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర స్థాయి పోలీసు అధికారి జూమ్‌ సమావేశం ద్వారా వీరితో అనుసంధానమై సైబర్‌ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మహిళలు, పిల్లల రక్షణ, ఉచిత చరవాణి(హెల్ఫ్‌లైన్‌) సంఖ్యలను వివరిస్తారు. నేర్చుకున్న అంశాలను సహచర విద్యార్థులకు, తల్లిదండ్రులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థుల మనోగతం వారి మాటల్లోనే.


అపరిచితులను గుడ్డిగా నమ్మొద్దు
-చింతల శివ, 8వ తరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, నాంపల్లి

చరవాణి ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చిన అనవసర లింక్‌ క్లిక్‌ చేస్తే ఖాతాలో డబ్బులు ఖాళీ అవుతాయనే విషయం సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాక తెలిసింది. రుణాలు, ఉపకార వేతనాలు ఇస్తామని, మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామని ఎవరైనా చెబితే గుడ్డిగా నమ్మొద్దు. అట్టి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలి. చరవాణిలో వచ్చే అనవసర లింకులు క్లిక్‌ చేయకూడదని తెలుసుకున్నా.


మహిళలు, పిల్లలకు ఉపయుక్తం..
-ఐతగోని శివాణి, 8వ తరగతి, ఎరుగండ్లపల్లి, మర్రిగూడ

సైబర్‌ కాంగ్రెస్‌లో అనేక విషయాలు తెలుసుకున్నా. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు, చిన్న పిల్లలకు ఉపయోగంగా ఉంది. సైబర్‌ మోసాల భారీన పడకుండా నేర్చుకున్న అంశాలు తోటి విద్యార్థినులు, గ్రామంలోని మహిళలకు వివరిస్తున్నా. ఈ మేరకు గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ‘షీ’ టీమ్స్‌, 100కు డయల్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటాను.  


అవగాహన వచ్చింది
-బి.సన్నిహత, 9వ తరగతి, కొంపల్లి, మునుగోడు

పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతుండే మాకు మొదట సైబర్‌ నేరాలపై తెలియలేదు. సైబర్‌ కాంగ్రెస్‌ ద్వారా అంబాసిడర్‌గా ఎంపికయ్యాను. ఉపాధ్యాయులు, నిపుణులు సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి ఏటీఎం పిన్‌ నంబరు అడిగితే పోలీసులకు ఎలా సమాచారం అందించాలో తెలుసుకున్నా.


చైతన్యం కల్పించేందుకే..
వహీదాబేగం, సైబర్‌ అంబాసిడర్ల సలహాదారు(మెంటర్‌), జడ్పీహెచ్‌ఎస్‌, నాంపల్లి

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు, మహిళలపై వేధింపులు పెరిగాయి. దీంతో క్షేత్ర స్థాయిలో అందరికీ అవగాహన కల్పించేలా పోలీసు, విద్యాశాఖ, ‘షీ’టీం, యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి వారి ద్వారా సహచర విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం కల్పించే కార్యాచరణ చేపట్టాం.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని