logo

అలుపెరగని ఆరోగ్య సేవకులు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Published : 25 Jan 2022 04:59 IST

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే


నాగారంలో ఇంటింటి సర్వేను పరిశీలిస్తున్న డీఐవో వెంకటరమణ, తదితరులు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. టీకాల పంపిణీలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నుంచి కొంత విముఖత ఎదురవుతున్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7.93 లక్షల మందికి మొదటి డోసు (98 శాతం), 6.36 లక్షల మందికి (78 శాతం) రెండో డోసు, ఆరు వేల మందికి బూస్టర్‌ డోసు (10 శాతం) అందజేశారు. ఈనెల 21 నుంచి ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తున్నారు.


ప్రజల్లో మార్పు కనిపిస్తుంది: రాణి, ఏఎన్‌ఎం, రామారం
మొదటి, రెండో దశలో ఇంటింటి సర్వే నిర్వహించిన సమయాల్లో కంటే మూడో దశ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. సర్వేలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం టీకాలు తీసుకోని వారిని గుర్తించి శత శాతం టీకాల పంపిణీకి కష్టపడుతున్నాం.


లక్షణాలు ఉన్నవారికి కిట్లు:అర్చన, ఆశా కార్యకర్త, సూర్యాపేట
 నాలుగు రోజులుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. చాలామందిలో దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అవసరమైన వారందరికీ కిట్లు అందిస్తున్నాం. గృహ నిర్బంధంలో ఉండాలని అవగాహన కల్పిస్తున్నాం. సెలవులు లేకుండా అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తోంది. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నాం.


అవగాహన కల్పిస్తున్నాం: అనిత, ఆశా కార్యకర్త, కాసరబాద్‌
కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సాధారణ జలుబు, జ్వరాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. విధిగా మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ను వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నాం. ఇబ్బందులు ఎదురవుతున్నా.. పట్టించుకోకుండా పనిచేసుకుంటూ వెళ్తున్నాం.


ఇబ్బందులు ఎదురైనా పనిచేస్తున్నాం: సంధ్య, ఏఎన్‌ఎం, తాళ్లఖమ్మంపహాడ్‌
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగ బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పగించిన విధులను పూర్త చేస్తున్నాం. ప్రభుత్వం మా సమస్యలనూ పరిష్కరించాలి.


నాలుగు రోజులుగా జిల్లాలో సర్వే వివరాలు:
జిల్లాలో ఏఎన్‌ఎంలు : 309 మంది
ఆశా కార్యకర్తలు : 1,035 మంది
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 22
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 4
గ్రామ పంచాయతీల సంఖ్య : 475
సర్వే పూర్తయిన నివాసాలు : 93,748
కొవిడ్‌ లక్షణాలు కలిగినవారు : 2,391 మంది


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని