logo

పది పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు

జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ తెలిపారు. పట్టణంలోని ఆదిత్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో శనివారం ఏర్పాట్లను తనిఖీ చేశారు

Published : 22 May 2022 03:59 IST

 

జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ తెలిపారు. పట్టణంలోని ఆదిత్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో శనివారం ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 107 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 19,910 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు, సిబ్బంది ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, చరవాణిలు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు 1,110 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. ప్రశ్న పత్రాలను సమీప పోలీస్‌ స్టేషన్లకు తరలించి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని వివరించారు. టెలి కాన్ఫరెన్స్‌లో డీఈవో భిక్షపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

క్రమబద్ధీకరణకు క్షేత్ర స్థాయి బృందాలు
నల్గొండ కలెక్టరేట్‌: అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న నిరుపేదల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు క్షేత్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 58 జీవో ప్రకారం 125 గజాల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి, పేదలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించేందుకు మొబైల్‌ యాప్‌ను రూపొందించిందని వివరించారు. ఒక లాగిన్‌ ద్వారా 250 దరఖాస్తులను ఒక బృందం పరిశీలించవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్‌డీవోలు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని